తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దీనిపై వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ 24న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ కేసులో వాయిదాలు కోరొద్దని సూచించింది. ఈ కేసులో చట్టానికి సంబంధించిన వివరాలను అందించడానికి గడువు కావాలని, అందుకే వాయిదా అడుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత ధర్మాసనానికి నివేదించింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కేసు విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కేసు విచారణ పదే పదే వాయిదా పడుతోందన్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు కుమ్మక్కయ్యారని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో వారిద్దరూ జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని, తెలంగాణ ఏసీబీ సరిగ్గా విచారించడం లేదని అభిప్రాయపడ్డారు.

ఓటుకు నోటు కుంభకోణం కేసు 2015లో జరిగింది. మే 31, 2015న ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను టీడీపీ సంప్రదించింది. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి మద్దతిస్తే రూ.5 కోట్లు ఇస్తామని బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముందుగా స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏసీబీ వలపన్ని టీడీపీలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డిని పట్టుకుంది. ఆయనతో పాటు మరికొందరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. అనంతరం వారందరికీ బెయిల్ మంజూరైంది. ఆడియో/వీడియో రికార్డింగ్‌ల రూపంలో నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించామని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి సీఎం అయ్యారు. ఇక ఈ కేసులో అప్పటి సీఎం చంద్రబాబు స్టీఫెన్ సన్‌తో ఫోన్లో సంభాషించినట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. దీనిపై రేవంత్ వాదన మరోలా ఉంది. ఈ కేసును విచారించే అర్హత ఏసీబీకి లేదని ఆయన వాదించారు. దీనిపై కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు. అయితే ఈ కేసు విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ వెలువడే నిర్ణయం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: