ఏపీలోని నంద్యాల నియోజకవర్గ రాజకీయాలు ఊహించని ట్విస్టులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరో వైపు వైసీపీ పొత్తుల్లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఇక్కడి నుంచి 2019లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి గెలిచారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిపై 34,560 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోసారి వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి బరిలోకి దిగారు. ఆయనపై టీడీపీ అభ్యర్థిగా ఎన్ఎండీ ఫరూఖ్ పోటీ చేస్తున్నారు. అయితే భూమా బ్రహ్మానంద రెడ్డి టికెట్ ఆశించి భంగ పడ్డారు. అయినప్పటికీ టీడీపీ తరుపున ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అయితే ఆయన ప్రసంగాలను పరిశీలించి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని బ్రహ్మానంద రెడ్డి తన ప్రసంగాల్లో ప్రజలను కోరుతున్నాయి. అయితే తనకు కాకుండా టికెట్ దక్కించుకున్న ఫరూఖ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన మాత్రం ఎక్కడ తన ప్రసంగాల్లో చెప్పడం లేదు. దీంతో ఆయన క్యాడర్ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.

కూటమిగా కొన్ని పార్టీలు బరిలోకి దిగితే కేవలం నియోజకవర్గంలో ఒక పార్టీకి మాత్రమే పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అయితే విభిన్న పార్టీల తరుపున స్థానికంగా పని చేసిన నాయకులు టికెట్ ఆశించి భంగ పడడం ఖాయం. ఇదే తరహా వాతావరణం నంద్యాలలో కూడా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి టీడీపీ తరుపున పోటీ చేసి తన ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,000లకు పైగా మెజార్టీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడ జగన్ మేనియా పని చేసింది. దీంతో భూమా బ్రహ్మానంద రెడ్డి భారీ తేడాతో ఓడిపోయారు. స్థానికంగా ముస్లిం జనాభా కూడా అధికంగా ఉంది. దీంతో ఆ వర్గానికి టికెట్ ఇస్తే విజయావకాశాలు పెరుగుతాయనే అంచనాతో ఎన్ఎండీ ఫరూఖ్‌కు టికెట్ కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన భూమా బ్రహ్మానంద రెడ్డి దీనిపై అలకబూనారు. దానిని మాత్రం పైకి కనపడనీయడం లేదు. ఓ వైపు చంద్రబాబును సీఎం చేయాలంటూనే స్థానిక అభ్యర్థికి మాత్రం కొంచెం కూడా సహకరించడం లేదు. దీంతో స్థానికంగా టీడీపీ అభ్యర్థి విజయావకాశాలపై ఇది ప్రభావం చూపనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: