- సంక్షేమంలో బాబుకు 60 మార్కులు.. జ‌గ‌న్‌కు 80
- అభివృద్ధిలో జ‌గ‌న్ క‌న్నా ఓ మెట్టు పైనున్న బాబు
- సంక్షేమంతోనే జీడీపీ రేటు పెరుగుతుంద‌న్న‌దే జ‌గ‌న్ ఆలోచ‌న‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

అభివృద్ధి-సంక్షేమం. ఇది ఏ ప్ర‌భుత్వానికైనా అత్యంత కీల‌కం. అభివృద్ధి అంటే.. కేంద్రం స్థాయిలో దేశా నికి, రాష్ట్రాల స్తాయిలో రాష్ట్రాల‌కు చెందిన అంశం. ఇక‌, సంక్షేమం విష‌యానికి వ‌స్తే.. అక్క‌డా, ఇక్క‌డ కూడా.. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డం.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమం అందించ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కీల‌క రోల్ పోషిస్తాయి. దేశాన్ని తీసుకుంటే.. మోడీ స‌ర్కారు గ‌త ప‌దేళ్ల‌లో అభివృద్ధికి 70 శాతం ప్రాధాన్యం ఇస్తుంటే.. సంక్షేమానికి 30 శాతం ప్రాధాన్యం ఇస్తోంది.


ప్ర‌జ‌ల‌కు ఏదీ ఉచితంగా రాద‌నే సంకేతాల‌ను మోడీ స‌ర్కారు చెబుతోంది. అయితే.. వారు స్వ‌యంగా యూనిట్లు పెట్టుకుని డెవ‌ల‌ప్ అయ్యేందుకు మాత్రం స‌హ‌కారం అందిస్తోంది. ఇక‌, అభివృద్ది ప‌రంగా చూస్తే.. రోడ్లు, పోర్టుల నిర్మాణం.. వంటివాటికి మోడీ స‌ర్కారు పెద్ద పీట వేసింది. వీటిలోనే రైళ్లు కూడా వ‌స్తాయి. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు హ‌యాంలో అభివృద్ధికి 60 శాతం పెద్ద పీట వేశారు. అందుకే ఆయ‌న హ‌యాంలో ర‌హ‌దారుల స‌మ‌స్య రాలేదు. అయితే.. సంక్షేమానికి మాత్రం 40 శాతం ప్రాధాన్య‌మే ఇచ్చారు.


ఫ‌లితంగా చంద్ర‌బాబు సంక్షేమాల రూపంలో ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోయారు. ఇది ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో పెద్ద మైన‌స్ అయిపోయింది. మేనిఫెస్టో లో చెప్పిన అంశాల‌ను కూడా చేయ‌లేక పోయార‌నే వాద‌న వినిపించింది. పైగా సంక్షేమానికి అనేక అర్హ‌త‌లు పెట్టి.. ల‌బ్ధిదారుల‌ను త‌గ్గించార‌నే అప‌ప్ర‌ద కూడా ఎదుర్కొన్నారు. అభివృద్ధి విష‌యానికి వ‌స్తే.. విశాఖ‌లోను, విజ‌య‌వాడ‌లోను.. అమ‌రావతి, తిరుప‌తి వంటి న‌గ‌రాల‌ను అభివృద్ధి చేశారు. ఇది ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చినా.. న‌గ‌ర ఓట‌ర్లు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. ఒక్క విశాఖ‌లో మాత్ర‌మే టీడీపీ నాలుగు స్థానాలు ద‌క్కించుకుంది.


ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. సంక్షేమానికి 80 శాతం ప్రాధాన్యం ఇచ్చారు. ల‌బ్ధిదారుల సంఖ్య పెంచ‌డం.. వారిని వెతుక్కుని వెళ్లిమ‌రీ సంక్షేమ ఫ‌లాలు అందించ‌డం చేశారు. ఇదే స‌మ‌యంలో అభివృద్ధికి 20 శాతం మాత్ర‌మే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ర‌హ‌దారులు, ఇత‌ర స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. న‌గ‌ర ఓటరు దూర‌మ‌య్యాడ‌నే వాద‌న కూడా ఉంది. అయితే.. సంక్షేమ‌మే అభివృద్ధి.. కుటుంబాల‌కు చేయూత అందిస్తే.. అదే జీడీపీని పెంచుతుంద‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌. ఇదీ.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య తేడా!

మరింత సమాచారం తెలుసుకోండి: