ఓటు ఎంతో విలువైనది. అలాంటి ఓటును అమ్ముకున్నవాడు అడ్డ గాడిద అనే నినాదాలు మనం వింటూ ఉంటాం. ఇవన్నీ సామెతల వరకే పరిమితమై ఉంటాయి తప్ప, ఆచరణలో ఎవరూ పాటించరు. ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు ఏ పార్టీ నాయకుడు వచ్చి డబ్బు ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. నాయకులు మనకు ఇప్పుడు ఎంత డబ్బు ఇస్తారో, అంతకు డబల్ వారు గెలిచిన తర్వాత సంపాదించుకుంటారు. ఇదంతా ఏ రాజకీయ నాయకుడైన చేసే పని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల అభ్యర్థులు గత కొన్ని నెలల నుంచి ప్రచారం చేసి ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఈ మూడు రోజులు ప్రలోభాల పని మీద పడతారు. ఓటర్లను ఏదో ఒక విధంగా కొనే ప్రయత్నం చేస్తారు. ఒక్కో ఓటుకు ఒక్కో విధమైన రేట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. గ్రామాల్లో అయితే ఒక రేటు, పట్టణాల్లో అయితే మరో రేటు ఉంటుంది.

ఈ విధంగా అధికార వైసిపి పార్టీ, ప్రతిపక్ష టిడిపి కూటమి గల్లి నుంచి పట్టణాల వరకు డబ్బుల ప్రవాహాన్ని  చూపిస్తోంది.ఈ తరుణంలో  అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కక్కుర్తి పడుతున్నట్టు తెలుస్తోంది. వచ్చిన డబ్బును సరైన పద్ధతిలో పంచకుండా వారి జేబులు నింపుకుంటున్నారట. ఉదాహరణకు ఓటుకు రూ:3వేలు పంచమని అధినాయకులు చెబితే కింది స్థాయి నాయకులకు వచ్చేసరికి 2000 అవుతోంది. ఇక ఆ డబ్బు కార్యకర్తలకు చేరి ప్రజలకు చేరేసరికి 500 రూపాయలుగా మారుతుంది. ఇలా వచ్చిన డబ్బులు నాయకులు, కార్యకర్తల జేబులు నిండి, ప్రజల వరకు వచ్చేసరికి  తగ్గిపోతోందని, దీనివల్ల ప్రజలు కూడా  అంత తక్కువ డబ్బుకు ఓటు వేయలేమని మొహం మీదే చెబుతున్నారట.  అంతేకాకుండా డబ్బులు పంచే విషయంలో కూడా కొంతమంది నాయకులు, వీళ్ళు మన పార్టీ కాదు, వాళ్లకు డబ్బులు ఇవ్వద్దు అనే కండిషన్లు పెడుతున్నారట.

ఈ విధంగా వచ్చిన డబ్బును వారి జేబులు నింపుకుంటున్నారు తప్ప సరైన పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయట్లేదనే ఒక గుసగుస వినిపిస్తోంది. ఇదే తరుణంలో ఐదేండ్లు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అధికారం సాధించాలని, వారు పంచే కొంత డబ్బు అయినా సరే పూర్తిస్థాయిలో ప్రజలకు అందేలా చూస్తున్నారట. ప్లాన్ ప్రకారం పంచుతూ, వైసీపీపై వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తున్నారని తెలుస్తోంది. కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ వైసిపి లాగే వ్యవహరించింది. వచ్చిన డబ్బును బీఆర్ఎస్ కిందిస్థాయి నాయకులు నొక్కేసి కనీసం ప్రజలకు పంచకుండా ఎలాగైనా మా పార్టీ గెలుస్తుందనే అపోహకు వెళ్లారు. ఇదే అదునుగా చూసిన కాంగ్రెస్ వారిచ్చే తక్కువ డబ్బు అయినా సరే, ప్రతి ఇంటికి పంపిణీ చేసి, బీఆర్ఎస్ పై వ్యతిరేకత వచ్చేలా చేశారు. చివరికి తెలంగాణలో అధికారం సాధించారు. మరి ఈ విధంగా వైసిపి నాయకులు కూడా అప్పటి బీఆర్ఎస్ పాలసీ పాటిస్తే మాత్రం ఓటమి తప్పదని కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: