ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలో కొత్త ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొత్తం 25 మంది మంత్రులు, కేబినెట్ మంత్రులకు శాఖలు పంపిణీని సీఎం చంద్రబాబు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ),  లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ వంటి అనేక ముఖ్యమైన శాఖలను కలిగి ఉన్నారు. అయితే ఆయన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన డిప్యూటీ సీఎం పదవి పవన్‌ కళ్యాణ్‌కు దక్కింది. జనసేనాని పవన్‌కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు.

 పవన్ అభీష్టం మేరకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి & నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించారు. ఈ శాఖల బాధ్యతలలో పవన్ నిత్యం తలములకలు కానున్నారు. క్షణం తీరిక లేకుండా ఆయనకు ఇక నుంచి చేతి నిండా పని ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అన్ని పనులు ఆయన నిర్వహిస్తున్న శాఖలతో ముడిపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తనదైన మార్క్ ఎంత చూపుతారు? ఇక ఇప్పటికే సగం మాత్రమే చేసిన సినిమాలు పూర్తి చేస్తారా అనే చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఏపీలో 70 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతం ఉంది. దీనికి సంబంధించిన బాధ్యత పవన్‌పై చాలా ఉంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు పవన్ వద్దే ఉన్నాయి. నిత్యం కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై, అక్కడి నుంచి నిధులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఈ శాఖలు సీనియర్లకు ఇచ్చే వారు. వైఎస్ హయాంలో ఈ శాఖను జేసీ దివాకర్ రెడ్డి నిర్వహించారు. ఆ తర్వాత విభజిత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఈ శాఖను చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూశారు.


ఇలా నిత్యం ఎంతో బరువు బాధ్యతలతో కూడిన ఈ మంత్రిత్వ శాఖలను పవన్‌కు చంద్రబాబు ఇచ్చారు. అయితే ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొన్ని సగం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ సినిమాలకు సమయం కేటాయించగలరా అనే సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనా మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో ఆయన సినిమాలపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: