ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ఏకంగా 164 సీట్లలో అప్రతిహత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జనసేన పోటీ చేసిన మొత్తం 21 సీట్లలో అన్ని సీట్లలో విజయం సాధించింది. ఇక బీజేపీ పోటీ చేసిన పది స్థానాలలో ఏకంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధించింది. ఓవరాల్‌గా కూటమిలో మూడు పార్టీలు కలిసి వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశాయి. తెలుగుదేశం పార్టీ గత 20 - 25 సంవత్సరాల లో గెలవని సీట్లలో కూడా ఈసారి కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. చంద్రబాబుకు మిగిలిన సీట్లలో పార్టీ గెలుపు సంగతి ఎలా ఉన్నా.. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ విజయం సాధించటం చాలా స్పెషల్ అని చెప్పాలి.


చంద్రగిరి.. చంద్రబాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. 1978లో ఆయన రాజకీయ ప్రస్థానం చంద్రగిరి నుంచే ప్రారంభమైంది. అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆయన.. మంత్రిగా కూడా పనిచేశారు. 1983 ఎన్నికలలో అక్కడే ఓడిపోయారు. 1985 ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేయలేదు. ఇక 1989 నుంచి కుప్పంలో ఆయన పోటీ చేయటం ప్రారంభించి 2024 ఎన్నికల వరకు ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్నారు. చంద్రగిరిలో చివరిసారిగా 1994లో మాత్రమే తెలుగుదేశం విజయం సాధించింది. అది కూడా ఎన్టీ రామారావు హ‌యాంలో అక్కడ నుంచి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1999, 2004, 2014, 2019 ఎన్నికలలో వరుసగా కాంగ్రెస్, వైసీపీ విజయం సాధిస్తూ వస్తున్నాయి.


చంద్రగిరి నియోజకవర్గాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీకి కంచుకోట‌గా మార్చారు. అలాంటి చోట గత ఎన్నికల్లో ఏకంగా 40 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన పులివర్తి నానికే చంద్రబాబు మరోసారి సీటు ఇచ్చారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ పులివర్తి నాని అంతే మెజార్టీతో.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మహిత్ రెడ్డి పై భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబు సొంతని యోజకవర్గాన్ని 25 సంవత్సరాల తర్వాత ఆయనకు కానుకగా ఇచ్చారు. చంద్రగిరి.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఇప్పుడు పులివర్తి నానికి కావలసినన్ని అభివృద్ధి పనులు చేసి పెట్టి.. నానిని స్పెషల్గా చూసుకోవాల్సిన బాధ్యత.. చంద్రగిరిని టీడీపీకి కంచుకోటగా మార్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: