
సినీ రంగంలో శిఖరాగ్ర స్థితిలో ఉన్న సమయంలోనే కృష్ణ రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. అయితే పాలిటిక్స్ లో ఆయన ఇమడలేకపోయారు. ఆరేడేళ్లకే యూటర్న్ తీసుకున్నారు. అంత తక్కువ సమయంలోనే రాజకీయాల నుంచి కృష్ణ ఎందుకు తప్పుకున్నారు? అంతగా ఆయన్ని భయపెట్టిన అంశాలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1984లో రాజీవ్ గాంధీ పిలుపుతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి కృష్ణ రాజకీయ రంగప్రవేశం చేశారు. 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కృష్ణ పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఉన్న టైమ్‌లో కృష్ణ ప్రజాసేవపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలతో చాలా వేగంగా మమేకం అయ్యారు. రాజకీయ వేదికలపై చురుకుగా ప్రసగించేవారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పాలనపై కూడా తరచూ విమర్శలు చేసేవారు.
రాజకీయాల్లోకి వచ్చాకే ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు ఏర్పడ్డాయన్న టాక్ బలంగా ఉండేది. అయితే 1989లో పార్లమెంట్‌కు ఎన్నిక అయినప్పటికీ, తర్వాతి ఎన్నికల్లో కృష్ణ మళ్లీ పోటీ చేయలేదు. పాలిటిక్స్ నుండి తప్పుకుని మళ్లీ సినిమాలే చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, అంతర్గత రాజకీయాల వల్ల ఒత్తిళ్లు రావడం కృష్ణను కలవపాటుకు గురిచేశాయి. అలాగే ప్రజాసేవ చేసే తపనతో రాజకీయాల్లోకి వచ్చినా, సిస్టమ్‌లో మార్పులు తేవడానికి తగిన స్వేచ్ఛ, వేదిక దొరక్కపోవడం ఆయన్ను నిరాశకు గురిచేశాయి.
నిజాయితీకి పెద్దపీట వేసిన కృష్ణకు రాజకీయాల్లో ఉన్న మాయాజాలం, అవినీతి ఏమాత్రం నచ్చలేదు. ప్రజల కంటే పదవుల మీద ఎక్కువ దృష్టిపెట్టే రాజకీయ నాయకుల మధ్య ఉండటం కన్నా.. తనకెంతో ఇష్టమైన సినీ ప్రపంచంలో ఉండటమే ప్రశాంతంగా ఉంటుందని గ్రహించిన కృష్ణ మళ్లీ నటుడిగా యూటర్న్ తీసుకున్నారు.