ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇద్దరూ ఈసారి ఢిల్లీకి కలసికట్టుగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు బాబు ఢిల్లీ పర్యటన చేస్తే లోకేష్ వేరే రోజుల్లో వెళ్ళేవారు. కానీ ఈసారి మాత్రం తండ్రీ కొడుకులు ఒకేసారి ఢిల్లీకి బయల్దేరడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తినలో వీరి టూర్ పూర్తిగా బిజీగా ఉంటుందని, కేంద్ర పెద్దలతో వరుస భేటీలు ప్లాన్ చేసినట్లు సమాచారం. బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ముగిసిన తర్వాత ఆయన షెడ్యూల్ మరింత బిజిగా ఉండనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతూ, అక్టోబర్ 16న కర్నూలులో జరగబోయే జీఎస్టీ 2.0 ప్రచార సభకు ఆహ్వానించనున్నారు. ఆ సభలో ప్రధాని మోడీతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొనబోతున్నారు. దీంతో బాబు తన ఆహ్వానం ద్వారా ఆ సభను మరింత ప్రతిష్టాత్మకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పర్యటనలో ముఖ్య ఆకర్షణ బాబు-మోడీ భేటీ. ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారని సమాచారం. మోడీని ఏపీ పర్యటనకు అధికారికంగా ఆహ్వానించడమే కాకుండా, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రాజకీయాలపై కూడా చర్చించే అవకాశముందని అంటున్నారు. ఇటీవల ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీకి వెళ్లిన బాబు, మోడీని కలవకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక పెద్ద రాజకీయ మైండ్ గేమ్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్ కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు, విద్యుత్, నీటి వనరుల వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఒకవైపు బాబు ప్రధాని, ఆర్థిక మంత్రిని కలవగా, మరోవైపు లోకేష్ కూడా కేంద్ర మంత్రులతో వరుస మీటింగులు జరపడం ద్వారా తండ్రీ కొడుకులు డబుల్ యాక్షన్‌లో కనిపించబోతున్నారు.

ఢిల్లీ టూర్ పూర్తి అయిన వెంటనే చంద్రబాబు నేరుగా విజయనగరం జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు. లోకేష్ మాత్రం తిరిగి అమరావతికి వెళ్తారు. మొత్తంగా, ఈసారి తండ్రీకొడుకులు కలిసి చేసిన ఢిల్లీ పర్యటన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ పర్యటన ప్రభావం చూపనుందనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు-లోకేష్ కలసి చేసే ఈ ఢిల్లీ పర్యటన కేవలం సాధారణ టూర్ కాదు. ఇందులో కేంద్ర నేతలతో భేటీలు, ఆహ్వానాలు, భవిష్యత్ వ్యూహాలు అన్నీ ఉండటంతో, ఈ టూర్ తర్వాత ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పులు రావచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: