
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ “ఓజీ” నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో దుమ్మురేపుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టకముందే 5 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరుకోవడం ఆషామాషీ కాదు. చాలా కాలంగా తెలుగు సినిమాలకు ఆ ప్రాంతంలో వచ్చిన బిగ్ వసూళ్లలో ఇది కూడా ఒకటి. అయితే ఓజీ సినిమా 5 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొట్టడం వెనక చాలా తతంగమే నడిచింది. ఇందులో చాలా మంది కష్టం కనిపిస్తుంది. మొదటగా చెప్పుకోవాల్సింది అడ్వాన్స్ బుకింగ్స్. రిలీజ్‌కు దాదాపు నెల రోజుల ముందే బుకింగ్స్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో ఉన్న ఉత్సాహంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి.
సినిమాపై ఉన్న హైప్‌ను గమనించిన డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల సంఖ్యను పెంచుతూ ప్లానింగ్ చేసుకోవడంతో ప్రీమియర్ రోజే వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా యుఎస్‌లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అసాధారణం. ఓజీని థియేటర్లలో చూడాలనే క్రేజ్ ప్రతి వారం స్క్రీన్ల సంఖ్యను పెంచేలా చేసింది. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కెనడాలో బయ్యర్లతో వచ్చిన సమస్యతో కొన్ని షోలు రద్దయ్యాయి. మరోవైపు కంటెంట్ డెలివరీలోనూ చివరి నిమిషం వరకు టెన్షన్ నెలకొంది. సెకండ్ హాఫ్ ఫైనల్ కాపీ సమయానికి సిద్ధం కాకపోవడంతో చాలా ఇబ్బంది ఎదురైంది.
అయితే పవన్ అమెరికా అభిమానులు స్వయంగా రంగంలోకి దిగి వారే కొరియర్లుగా మారిపోయి డ్రైవ్స్ సకాలంలో థియేటర్లకు అందేలా చేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా షోలు రద్దు చేయకుండా, అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తాము చేయగలిగిన ప్రతిదాన్ని చేశారు. ఫలితంగా ప్రీమియర్లు సమయానికి పడ్డాయి. ఫ్యాన్స్ థియేటర్లలో ఎంజాయ్ చేశారు. మొత్తానికి ఈ సక్సెస్ వెనుక ఉన్న పక్కా ప్రణాళిక, అభిమానుల అండ, డిస్ట్రిబ్యూటర్ల పట్టుదల అన్నీ కలిసొచ్చాయి.