సీనియర్ ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించే వారిలో దర్శకుడు వైవీఎస్ చౌదరి ఒకరు. ఆ అభిమానం కారణంగానే ఆయన నందమూరి కుటుంబంతో అనుబంధం పెంచుకుని, వారి వారసత్వాన్ని కొనసాగించేలా సినిమాలు చేశారు. వైవీఎస్ చౌదరి తొలిసారి ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి’ సినిమాతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, రేయ్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


బాలకృష్ణతో చేసిన ‘ఒక్క మగాడు’, మంచు విష్ణుతో చేసిన ‘సలీం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్‌లో పెద్ద‌ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కారణంగా చాలాకాలం పాటు ఆయన సినీ పరిశ్రమకు దూరమయ్యారు. చివరిగా 2015లో విడుదలైన ‘రేయ్’ తర్వాత వైవీఎస్ నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత, గత ఏడాది ఆయన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.


ఈసారి ఆయన తీసుకున్న బాధ్యత మరింత ప్రత్యేకం. దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావును టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వైవీఎస్ చౌదరి సతీమణి గీత నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇక చౌద‌రి భార్య గీత విషయానికి వస్తే, ఆమె గతంలో నటి కూడా అన్న విషయం చాలామందికి తెలియదు. నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’ లో ఆయన చెల్లెలి పాత్రలో కనిపించారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’ సినిమాలో రెండవ హీరోయిన్‌గా నటించారు.


ఆ రోజుల్లోనే గీత, వైవీఎస్ చౌదరి పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రానికి వైవీఎస్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండగా వారి పరిచయం మరింత గాఢమైంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వీరివి వేర్వేరు కులాలు కావ‌డంతో వీరి ప్రేమ‌ను ముందు పెద్ద‌లు అంగీక‌రించ‌లేదు. త‌ర్వాత ఇరు వైపులా కుటుంబ స‌భ్యుల‌ను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: