బిజెపి సీనియర్ నాయకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయనని, ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసేది లేదని.. అంతేకాదు, తన స్థానంలో సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలిపానని ఆయన వెల్లడించారు. గత ఎన్నికల్లోనే భూపేష్ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచించారు. కానీ చివరి నిమిషంలో ఆ సీటు బిజెపికి కేటాయించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా భూపేష్‌కు రాజ‌కీయంగా న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.


తాజాగా ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భూపేష్ రెడ్డి అనుచరుల్లో ఉత్సాహం నింపాయి. “తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటూ, భూపేష్ విజయానికి కృషి చేస్తానని” ఆయన ప్రకటించడం ఆస‌క్తిగా మారింది. ఆదినారాయ‌ణ చేసిన ఈ ప్రకటనతో జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఆ ప్రాంతంలో వైసీపీ బలమైన కేడర్ ఉన్నా ఆదినారాయణ రెడ్డి వర్గం కూడా ప్రభావవంతంగా ఉంది. ఇప్పుడు ఆ వర్గం భూపేష్ వెంటే నడుస్తుందా లేదా రెండు ముక్కలవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.


ఆదినారాయణ రెడ్డి తన రాజకీయ జీవితం మొత్తం వర్గాల మధ్య సమన్వయం కల్పిస్తూ, ఏ పార్టీలో ఉన్నా అందరినీ కలుపుకొని ముందుకు సాగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కానీ భూపేష్ రెడ్డికి ఆ లక్షణం ఎంత వ‌ర‌కు ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీద‌కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూపేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది. ఆదినారాయణ రెడ్డి తప్పుకోవడం ఆయనకు లైన్ క్లియర్ చేసినా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగకపోతే అది మళ్లీ మైనస్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జమ్మలమడుగులో కొత్త సమీకరణాలు ఎలా రూపుదిద్దుకుంటాయో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: