దేశ రాజధానిని కుదిపేసిన ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు అధికారులు ప్రతి నిమిషం వివరాన్ని చెదరగొడుతూ ఆశ్చర్యపరిచే విషయాలు వెలికితీస్తున్నారు. పేలుడు జరిగిన సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ – మొత్తం పదకొండు గంటల పాటు ఆ కారు ఎక్కడెక్కడ తిరిగిందన్న వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరిన ఆ కారు, సాయంత్రం 6.52 గంటలకు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలిపోయింది. ఈ మధ్యలో కారు ప్రయాణించిన మార్గాన్ని అధికారులు సీసీ టీవీ ఫుటేజ్, టోల్ గేట్ల డేటా ద్వారా ట్రాక్ చేశారు. ఉదయం 7.30 గంటలకు ఫరీదాబాద్ ఆసియన్ ఆసుపత్రి సమీపంలో కారు కనిపించగా, 8.13 గంటలకు బదర్‌పూర్ టోల్‌ప్లాజా దాటిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అక్కడ మాస్క్ ధరించిన వ్యక్తి టోల్ రసీదు తీసుకుంటున్నట్టు గుర్తించారు.


తరువాత కారు ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్ద ఆగింది. అక్కడ కాలుష్య ధృవీకరణ పత్రం తీసుకున్నట్లు సీసీ టీవీ కెమెరాలు చెబుతున్నాయి. అంతటితో ఆగలేదు. సాయంత్రం 3.19 గంటల ప్రాంతంలో ఎర్రకోట కాంప్లెక్స్‌కు చేరిన కారు, సునెహ్రీ మసీదు పార్కింగ్‌ వద్ద దాదాపు మూడు గంటలు ఆగింది. ఈ సమయంలో డ్రైవర్ ఉమర్ నబీ తన మొబైల్ ఫోన్‌లో “ఫరీదాబాద్ అరెస్టులు” అంటూ గూగుల్‌లో శోధించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం సాయంత్రం 6.22 గంటలకు కారు పార్కింగ్ నుంచి బయటకు వచ్చి నేరుగా ఎర్రకోట వైపు వెళ్ళింది. సరిగ్గా 6.52 గంటలకు ఘోర పేలుడు సంభవించింది. క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రదేశం యుద్ధరంగంగా మారింది. దర్యాప్తు అధికారులు పేలుడు ప్రదేశంలో గుర్తించిన శరీర భాగాలు ఉమర్ వేనా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉమర్ తల్లి, సోదరులు (జహూర్, ఆషిక్ నబీ)లను పుల్వామా నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. ఉమర్ చివరిసారిగా శుక్రవారం తన తల్లికి ఫోన్ చేసి “లైబ్రరీలో చదువుకుంటున్నాను… నాకు కాల్ చేయొద్దు” అని చెప్పినట్లు సమాచారం.

 

ఇక ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక అసలు సంచలనం ఏంటంటే – ఆ కారులో ఉమర్‌తో ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఫరీదాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత వారు ఎక్కడా బయటకు దిగలేదని సమాచారం. పేలుడు జరిగిన కారును ఉమర్ అక్టోబర్ 29న కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. మరింతగా, కారు మొదటి యజమాని సల్మాన్ ఇంటిని అద్దెకు ఇచ్చిన దినేశ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఆసుపత్రిలో ఉమర్‌తో పనిచేసిన వైద్యులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద, ఎర్రకోట బాంబు పేలుడు కేసు దేశాన్ని కుదిపేస్తోంది. ఉమర్ నబీ రహస్య యాత్ర వెనుక ఇంకా ఎన్ని మిస్టరీలు దాగి ఉన్నాయో అన్నది దర్యాప్తు ముగిసే వరకు తెలియదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: