దేశవ్యాప్తంగా దాడులకు స్కెచ్!
ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు యాదృచ్ఛికంగా జరిగినట్లు ప్రారంభంలో అనుమానించినా, తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని సూచిస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, 26/11 ముంబయి ఉగ్రదాడి తరహాలో దేశాన్ని కుదిపేసే మరో దాడికి పథకం వేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలను టార్గెట్ చేశారు. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రదేశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రదేశాలలో పేలుళ్లు జరిపే ప్రయత్నం కూడా ఉందని సమాచారం.
ఈ కుట్ర జనవరి నెల నుంచే రూపుదిద్దుకుంటోందని, పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న బృందం నెలల తరబడి ప్రణాళికలు సిద్ధం చేసిందని అధికారులు పేర్కొన్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాలలో ఉన్న హై ప్రొఫైల్ లొకేషన్లు కూడా ఈ టెర్రర్ ప్లాన్‌లో భాగమని తెలుస్తోంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా దాడులకు ఉపయోగించేందుకు 200కి పైగా శక్తివంతమైన ఐఈడీలను సిద్ధం చేశారు అనే సమాచారం బయటకు వచ్చింది.
26/11 ముంబయి దాడులు – ఎప్పటికీ మర్చిపోలేని మృత్యు రాత్రి:
2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడి జరిపారు. పాక్ నుండి సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకున్న 10 మంది ఉగ్రవాదులు నగరంలోని పలు ప్రదేశాలలో రక్తపుటేరులు పారించారు.చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్ ప్రాంగణాలు రక్తసిక్తమయ్యాయి. ఈ భయానక దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు.
ఈ దాడిలో జీవితంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012లో పుణెలోని ఎరవాడ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. ఆ దాడికి రూపకల్పన చేసిన ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా అమెరికాలో ఉండగా, ఇటీవల భారత ప్రభుత్వం అతన్ని అమెరికా నుండి అప్పగింత రూపంలో తీసుకువచ్చింది. ప్రస్తుతం అతను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి