ఇప్పుడు పోలీసులకి అర్ధం కానీ విషయం ఏమిటంటే..ఉమర్ మహమ్మద్ మూడు గంటలపాటు కారులో ఎందుకు ఉండిపోయాడు? ముందుగా సిద్ధం చేసిన ఉగ్ర ప్రణాళికను అమలు చేయడానికి సరైన సమయాన్ని వేచి చూసాడా? లేక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరో నిర్ణయం తీసుకోవాలనుకున్నాడా? అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు విస్తృతంగా పరిశీలిస్తున్నాయి. అధికారుల అనుమానం ప్రకారం, శీతాకాలం కావడంతో సాయంత్రం వేళల్లో ఎర్రకోట ప్రాంతంలో సాధారణంగా భారీగా ప్రజలు గుమికూడుతారు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఉమర్ మహమ్మద్ కారు వెనుక సీటులో డిటోనేటర్లు మరియు పేలుడు పదార్థాలు ఉంచి ఎర్రకోట ప్రాంతానికి వచ్చాడు. అతడి ఉద్దేశ్యం పెద్ద మొత్తంలో ప్రాణనష్టం కలిగించడం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, సోమవారం రోజు ఎర్రకోటకు సెలవు రోజు కావడంతో అక్కడ పర్యాటకులు ఎక్కువగా రాకపోవడం అతడికి అనుకోని పరిణామమైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఉమర్ క్షణికంగా గందరగోళానికి గురైనట్లు భావిస్తున్నారు. “ఇప్పుడు ఇక్కడే పేల్చాలా? లేక వేరే ప్రదేశానికి తరలించాలా?” అనే ఆలోచన అతని మనసులో మొదలై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆ ఆలోచనల మధ్యలోనే ఉమర్ తన కారును అక్కడి నుండి నేతాజీ సుభాష్ మార్గ్ వైపు మళ్లించాడు. కొద్దిసేపటికి ఆ కారు ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్దకు చేరుకుంది. అయితే, ఈ కదలిక పెద్ద ప్రమాదానికి దారి తీసింది. సుమారు 6.30 గంటల సమయంలో ఆ కారులో భారీ పేలుడు సంభవించింది. దాంతో చుట్టుపక్కల వాహనాలు దెబ్బతిన్నాయి. క్షణాల్లో ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది.దర్యాప్తు అధికారులు చెబుతున్నట్టుగా, ఉమర్ ఎర్రకోట వద్ద గడిపిన మూడు గంటల సమయం ఈ కేసులో కీలకమైన క్లూ అవుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలో అతను ఫోన్ ద్వారా ఎవరితోనైనా మాట్లాడాడా? ఏదైనా సిగ్నల్ కోసం వేచి ఉన్నాడా? అనే అంశాలను సాంకేతిక ఆధారాలతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి