ఏపీ పాలిటిక్స్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మండలి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన జకియా ఖానం రాజీనామా వ్యవహారం చివరకు ఊహించ‌ని ట్విస్ట్‌తో ముగిసింది. బీజేపీలో చేరిపోయిన ఆమె, వైసీపీకి గుడ్‌బై చెప్పినట్లు కనిపించిన ఆమె, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఆమె త‌న రాజీనామాను ఉపసంహరణ చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హైకోర్టు జోక్యంతో మండలి చైర్మన్ రాజీనామా కేసులపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో అందరికంటే పెద్ద పరిణామం జకియా ఖానం నుండి వచ్చింది. తాను ముందు ఇచ్చిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో వైసీపీకి రిలీఫ్ ల‌భించింది. ఆమె అభ్యర్థనను స్పీకర్ అంగీకరించడంతో రాజీనామా రద్దు అధికారికమైంది.

ఎన్నికల ఫలితాల తర్వాత జకియా ఖానం నారా లోకేష్‌ను కలవడం, కడప నేతలు ఆమెను పార్టీలోకి తీసుకోవడంలో ఆసక్తి చూపకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నల ముసురుకొచ్చాయి. దాంతో ఆమె బీజేపీలో చేరిపోయారు. పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె బీజేపీ కండువా కూడా కప్పుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం పూర్తిగా రివర్స్ గేర్ వేశారు. అనర్హత వేటు పడే అవకాశాన్ని గుర్తించిన ఆమె వెనక్కి తగ్గి వైసీపీలోనే కొనసాగడాన్ని ఎంచుకున్నారు.

జకియా ఖానం ఎమ్మెల్సీ పదవి కాలం వచ్చే ఏడాది జూలై వరకే ఉంది. అంటే ఇంకా ఏడు నెలలే. ఈ కాలంలో రాజీనామా ఆమోదమైనా ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇక పదవిలో చివరి వరకు కొనసాగడం తనకే మేలు అనుకున్నారో ఏమో రాజీనామా విత్ డ్రాను చేసుకున్నారు. మొత్తానికి జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ నిర్ణయంతో వైసీపీకి బిగ్ బూస్ట్ అంద‌గా, బీజేపీకి మాత్రం గట్టి షాక్ త‌గిలింది. కాగా, జకియా ఖానంతో మరో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా బీజేపీలో చేరారు. అయితే ఆమె విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోయిన‌ప్ప‌టికీ.. తన రాజీనామాకు కట్టుబడి ఉంటారని సమాచారం. ఇప్ప‌టికైతే ఆమెపై నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: