గురజాల నియోజకవర్గంలో తిరిగి పూర్వ వైభవం రానుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి సుదీర్ఘకాలం విజయం దక్కించుకుని ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్న య‌రపతినేని శ్రీనివాసరావు `పసుపు-కుంకుమ` పేరుతో గతంలో చేపట్టిన ఒక కీలక కార్యక్రమం రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. 2019 ఎన్నికలకు ముందు స్వయంగా సీఎం చంద్రబాబు పసుపు కుంకుమ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు.


ఇలా వినూత్న కార్యక్రమాలకు గురజాల నియోజకవర్గం వేదిక అవుతూనే ఉంది. పసుపు కుంకుమ పథకం కింద ఆడబిడ్డలకు సారె ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సాయం చేయటం, సీమంతం చేయటం వంటివి గురజాల నియోజకవర్గం లో ఆనవాయతీగా మారింది. అయితే 2019 -2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని అటకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ గురజాలలో పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఎమ్మెల్యే య‌రపతినేని శ్రీనివాసరావు ప్రయత్నం చేస్తున్నారు ..


దీనిలో భాగంగా మళ్లీ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా వచ్చే సంక్రాంతిని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న కళలను ముఖ్యంగా పల్నాడు సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా నాలుగు రోజులు పాటు నిర్వహించే కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. తద్వారా గురజాల పూర్వవైభవాన్ని సంతరించుకునేలాగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా `కోడిపోరు` పేరుతో కార్యక్రమాలు చేప‌ట్ట‌నున్నారు.


అదేవిధంగా మల్ల యుద్ధాలు, కత్తి సాము, కర్ర సాము వంటి సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు గురజాల ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన ప్రజలకు చెప్పడంతో నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా గురజాలలో జరగబోయే ఈ సాంస్కృతిక కార్యక్రమాలపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఏదేమైనా సంప్రదాయాలకు, స్థానికంగా ఉన్న కళలకు ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: