బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఏర్పడిన భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) ప్రభావం వచ్చే ఎన్నికల నాటికి ఏ విధంగా ఉంటుంది? నిజంగానే బిసి ఓటు బ్యాంకు ను ఈ పార్టీ చీలుస్తుందా? అనేది రాజకీయ వర్గాల్లోనూ.. బీసీ సామాజిక వర్గాల్లోనూ చర్చగా మారింది. గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ బలమైన పోటీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభావం ఉన్నప్పటికీ ఆయనకు ఆశించిన స్థాయిలోనే ఓట్లు పడ్డాయి.


ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని పుంజుకునేలా చేయాలి అన్నది బోడే ప్రతిపాదన. ఆదిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బోడే ఉంటారు... అన్న నినాదంతో రామచంద్ర యాదవ్ ముందుకు సాగుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వం భూములు కేటాయించాల్సి వచ్చినప్పుడు అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బీసీవై నిలబడింది. తర్వాత రైతు సమస్యల మీద కూడా బీసీవై పార్టీ పోరాటం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రామచంద్ర యాదవ్ పర్యటనలు కూడా కొంతవరకు సాగాయి.


ఇక ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి మేలు చేసే ఉద్దేశంతో పలు డిమాండ్లను ఆయన ప్రస్తావిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఇవన్నీ అంతర్గత రాజకీయాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. పైకి బోడే గురించి పెద్దగా ప్రధాన పార్టీలు పట్టించుకోకపోయినప్పటికీ బీసీ సామాజిక వర్గం బోడే వైపు మళ్లుతున్నదన్న చర్చ నడుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీ ప్రభావం భారీ స్థాయిలో ఉన్నా ఆశ్చ‌ర్యం లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట.


అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది బీసీవై పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు లేదా అనుకున్న స్థాయిలో నియోజకవర్గాలను ఆ పార్టీ దక్కించుకోలేకపోవచ్చు. కానీ ప్రధాన పార్టీలకు ఓటు బ్యాంకు చీలిక వ్యవహారం పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. బీసీవై పార్టీ ప్రభావం బీసీల‌పై ఎక్కువ‌గా ఉంటున్న నేప‌థ్యంలో అన్ని మెజారిటీ పార్టీల ఓటు బ్యాంకు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే.. బీసీవై.. హిందూత్వ పార్టీకి చేరువ‌గా ఉన్న క్ర‌మంలో మైనారిటీ ఓటు బ్యాంకు మాత్రం ఏ పార్టీకైనా కుశ‌లంగానే ఉంటుంద‌ని భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: