అమ్మాయిల పెళ్లి వ‌య‌స్సు కు సంబంధించి చాలా కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల వివాహ వ‌య‌స్సు 21 ఏళ్ల‌కు పెంచుతూ బిల్లు తీసుకురావ‌డంతో ఈ అంశం మ‌రోసారి చర్చ‌కు తెరలేపింది. పాత‌రోజుల్లో అమ్మాయిల‌కు చిన్న వ‌య‌స్సులోనే పెళ్లిళ్లు చేసేవారు. త‌న కూతురు వ‌య‌స్సున్న అమ్మాయిల డ‌బ్బుకు ఆశ‌పోయి ముస‌లి వాళ్ల‌కు కూడా క‌ట్ట‌బెట్టే వాళ్లు. వారి ఇష్టం లేకుండానే క‌నీసం వారి అభిప్రాయం లేకుండానే క‌న్యాశుల్కం కు ఆశ‌ప‌డి పెళ్లిళ్లు చేసేవారు.  దీనిపై అప్ప‌ట్లో గుర‌జాడ‌, కందూకూరి వీరేశ‌లింగం లాంటి అనేక మంది సంఘ సంస్క‌ర్త‌లు పోరాటం చేశారు. 


ఇదే క్ర‌మంలో పెళ్లినాటికి అమ్మాయి వ‌య‌స్సు అబ్బాయికంటే ఐదు సంవ‌త్స‌రాలు త‌క్కువ ఉండాల‌ని అనాదిగా వ‌స్తున్న ఆచారంగా కొన‌సాగించారు. అబ్బాయి కంటే అమ్మాయి పెద్ద‌ది అయితే అబ్బాయికి ఆయుక్షీణమంటూ చెబుతూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు కాలం మారింది.. కాలంతో పాటు అభిప్రాయాలు మారాయి. అమ్మాయిలు చ‌దువుతో పాటు ఉద్యోగాలు చేస్తూ అబ్బాయిల‌తో స‌మానంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో వివాహానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ తీసుకుంటున్నారు. వారికి న‌చ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. కులాంత‌ర‌, మ‌తాంతర వివాహాలు గ‌ణ‌నీయంగా జ‌రుగుతున్న 21వ శ‌తాబ్ధంలో వ‌రుడి విష‌యంలో వ‌ధువే స్వ‌యంగా అడిగి తెలుసుకుంటోంది. పెళ్లి త‌రువాత వైవాహిక బంధం స‌రిగ్గా లేకుండా విడాకులు తీసుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు.



  ఇంకా ముందుకు వెళ్లి పెళ్లికి ముందే డేటింగ్, స‌హ‌జీవ‌నం చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. వివాహ విష‌యంలో నూత‌న శ‌కం మొద‌లైన ఈ కాలంలో ప్రేమ వివాహాలు కూడా అన్ని ప‌రిశీల‌న‌ల త‌రువాతే జ‌రుగుతున్నాయి. పెద్ద‌లు ఏర్పాటు చేసిన పెళ్లిలో కూడా త‌న‌కంటే ఒక‌టి లేదా రెండు సంవ‌త్స‌రాలు పెద్ద‌వాడైన వ్య‌క్తిని మాత్ర‌మే వ‌ధువు కోరుకుంటోంది. పెద్ద‌లు అంగీక‌రించి అన్ని విధాలా అనుకూల‌మైన సంబంధం అయితే, పెళ్లి కొడుకు ఒక‌టి రెండేళ్లు చిన్న‌వాడైనా ఫ‌ర్వాలేద‌ని అని అనుకుంటున్నారు. ఒకప్ప‌టి లాగా అబ్బాయి ఖ‌చ్చితంగా పెద్ద‌వాడై ఉండాల్సిన నియ‌మాలేం పాటించ‌డం లేదు కూడా. త‌మ‌కు న‌చ్చితే చిన్న వాడైన  యువ‌కుడుని పెళ్లి చేకునేందుకు వెనుకాడ‌డం లేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: