
కొందరు తమను తాము చాలా తెలివైన వాళ్ళనుకుంటారు. అందులో తప్పులేదు. కానీ ఎదుటి వాళ్ళు ఎందుకు పనికిరారని అనుకోవటంతోనే సమస్యలు ఎదుర్కుంటుంటారు. తాజాగా జేసీ సోదరుల వ్యవహారం అలాగే అనిపిస్తోంది. సరే వీళ్ళ తెలివికి కోర్టు చెక్ పెట్టేసిందనుకోండి అది వేరే సంగతి. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే తాడిపత్రి, మైదుకూరులో వైసీపీకన్నా రెండు వార్డుల్లో టీడీపీ ఎక్కువ గెలిచింది. అయితే ఎక్స్ అఫీషియో ఓట్లతో మైదుకూరులో వైసీపీది పై చేయి అయ్యింది. కానీ తాడిపత్రిలో సమానమైంది. ఇక్కడే జేసీల అతితెలివి బయటపడింది.
బహుశా ఇలాంటి సమస్య వస్తే ఏమి చేయాలని జేసీ సోదరులు ముందే ఆలోచించినట్లున్నారు. అందుకనే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు+ఎంఎల్సీ అయిన దీపక్ రెడ్డిని తాడిపత్రి మున్సిపాలిటిలో ఎక్స్ అఫీషియోగా మెంబర్ గా నమోదు చేయించాలని అనుకున్నారు. ఎన్నికలు జరిగి టీడీపీ 18 ఓట్లు+సీపీఐ+ఇండిపెండెంట్ ఓట్లతో 20 ఉన్నాయి. అదే విధంగా వైసీపీకి 18 ఓట్లు+ఎంఎల్ఏ+ఎంపి ఎక్స్ అఫీషియో ఓట్లతో 20 ఉన్నాయి. అంటే ఇక్కడ రెండుపార్టీల బలం సమానమన్నమాట. ఇక్కడే జేసీలు అతితెలివికిపోయారు. దీపక్ తో తాడిపత్రి మున్సిపాలిటిలో ఎక్స్ అఫీషియో మెంటర్ గా నమోదు చేయించుకోవాలని అనుకున్నారు. దీన్ని మున్సిపల్ కమీషనర్ తిరస్కరించారు. దీపక్ దరఖాస్తునే కాదు ముగ్గురు వైసీపీ ఎంఎల్సీల దరఖాస్తులను కూడా తిరస్కరించారు.
వెంటనే దీపక్ కోర్టులో కేసు వేశారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టు దీపక్ కేసును కొట్టిసింది. మున్సిపల్ చట్టం ప్రకారం ఎంఎల్సీ అయ్యేనాటికి ఏ ప్రాంతంలో ఓటుంటే అక్కడ మాత్రమే చెల్లుబాటవుతుంది. అంతేకానీ అవసరానికి తనిష్టం వచ్చినట్లు మార్చుకుంటానంటే కుదరదు. అయితే తాడిపత్రి మున్సిపాలిటిలో అవసరం అవుతుందేమో అనే అనుమానంతో తన ఓటును దీపక్ రాయదుర్గం నుండి తాడిపత్రికి మార్చుకున్నారు. కోర్టు తీర్పుతో వాళ్ళ అతితెలివే బయటపడింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే దీపక్ ఓటు చెల్లుబాటైతే వైసీపీ ఎంఎల్సీల ఓట్లు కూడా చెల్లుబాటవుతుంది. అప్పుడు టీడీపీకి అదనంగా ఒక ఓటు వస్తే వైసీపీకి మూడు ఓట్లొస్తాయి. అప్పుడు తాడిప్రతి మున్సిపాలిటిని హ్యాపీగా వైసీపీ ఎగరేసుకుపోతుంది. ఇంతచిన్న విషయాన్ని కూడా జేసీలు ఆలోచించలేదు. ఇక్కడే జేసీల అతితెలివి బయటపడింది.