దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాలతో పాటు కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు దసరా పండగ శోభను సంతరించుకున్నాయి. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో  అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్‌లో వైభవంగా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. దసరా వేడుకలను వైభవంగా జరుపుకునే బెంగాలీలు, కన్నడవాసులు ఈ సారి మరింత భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. 


కోల్‌కతాలోని దుర్గామాత ఆలయాలు అందంగా ముస్తాబు అయ్యాయి. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులతో ధగధగ మెరిసిపోతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని పూజలు చేస్తున్నారు. అటు గుజరాత్ లోని సూరత్ లో దసరా నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని నగరంలోని ఉమియాధామ్ మందిర్ లో మహా హారతి కన్నుల పండుగగా జరిగింది. వేలాదిమంది ప్రజలు ఈ హారతిలో పాల్గొన్నారు.  


దసరా వైభవాన్ని చూడాలన్నా.. మనసు నిండుగా ఆ ఆనందాన్ని నింపుకోవాలన్నా మైసూరు వెళ్లాల్సిందే. దసరా అంటేనే మైసూరు, మైసూరు అంటేనే దసరా అన్న స్థాయిలో అక్కడి దసరా పండుగ జరుగుతుంది. దుర్గా నవరాత్రులు వివిధ కార్యక్రమాల ఏర్పాట్లతో దేశ విదేశీ పర్యాటకులు అమితంగా ఆకట్టుకుంటోంది మైసూరు దసరా మహోత్సవం. పది రోజుల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలు నవరాత్రి చివరి రోజు విజయదశమితో ముగుస్తాయి. 


దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ విద్యుద్దీప కాంతులతో దుర్గమ్మ ఆలయాన్ని  ముస్తాబు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతీ ఆలయం దగ్గర పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తుతుండటంతో డేగ కన్నువేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: