వేంకటేశ్వరుడు, వేంకటాచలపతి, శ్రీనివాసుడు, గోవిందుడు, ఏడుకొండ‌లు.. ఇలా ఏ పేరుతో పిలిచినా ప‌లికే వెంక‌టేశ్వ‌ర స్వామికి దేశ‌వ్యాప్తంగా ఎన్నో దేవాల‌యాలు.. ఎంద‌రో భ‌క్తులు ఉన్నారు. కోట్ల మంది హిందువుల కలియుగ ఆరాధ్య దైవమైన ఈ వెంకటేశ్వర స్వామి.. భక్తులు కోరిన కోరికలు ఖ‌చ్చితంగా తీరుస్తాడ‌ని న‌మ్మ‌కం. ఆ స్వామి వెలిసిన ఒక్కో క్షేత్రం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అలా ఆ దేవదేవుడు వెలసిన క్షేత్రాల్లో ఒకటి మహారాష్ట్ర .. సిరొంచా పరిధిలోని వెంకటాపూర్ లో దర్శనమిస్తుంది.

వరదల పాలైన ఆ ప్రాంత ప్రజలకు వరదహస్తం అందించడానికి...శ్రీనివాసుడిగా చెట్టు తొర్రలో దర్శనమిచ్చాడు. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహిత తీరంలో ప్రాచీన వృక్షాన్నే ఆనందనిలయంగా మార్చుకుని.. వేంకటేశ్వరుడు ఇరుదేవేరులతో కొలువుదీరాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చాలాకాలం క్రితం ఈ ప్రాంతంలో వచ్చిన వరదల్లో ఈ మూల మూర్తులు ఈ ప్రదేశానికి కొట్టుకుని వ‌చ్చి.. సిరొంచా తాలూకాలో ఉన్న వెంకటాపూర్‌ సమీపంలోని వాగుఒడ్డు కాల్వ పక్కన మద్దిపాలచెట్టు తొర్రలో అవి ఆగిపోయాయి. ఆ త‌ర్వాత‌ గ్రామస్తులలో కొంతమంది భక్తులకి స్వామివారు కలలో కనిపించి, అదే ప్రదేశంలో తమకి నిత్య పూజలు నిర్వహించవలసింగా ఆదేశించాడని అంటారు.

అప్పటి నుంచి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తూ వస్తున్నారు. అలమేలు మంగ, పద్మావతి, వేంకటేశ్వరస్వామి విగ్రహాలతో పాటూ... చూడముచ్చటైన వినాయక ప్రతిమ, నాగేంద్రుడి పడగ కూడా ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. ఆ మూర్తులూ పూజలు అందుకుంటున్నాయి.  ఇక ఆ పల్లెకు వేంకటేశ్వరుడు కొలువైన కారణంగానే వెంకటాపూర్‌ అన్న పేరు వచ్చింది. అలాగే ఇక్క‌డ స్వామివారు మహిమాన్వితుడనీ, కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.  ఆపదల నుంచి ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి స్వామి కాపాడుతూ ఉంటాడని చెబుతుంటారు. తమ కోరికకలు నెరవేర్చిన స్వామికి భక్తులు తల నీలాలు చెల్లించి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. కాగా, ఈ ఆల‌యానికి తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచీ భక్తులు తరలివస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: