వెస్టిండీస్‌ తో నేడు చెన్నై వేదికగా జరుగుతున్న తొలివన్డేలో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. మొదట టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేయగలిగింది. చాలాకాలం నుండి ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (69 బంతుల్లో 71, 7 ఫోర్లు, 1 సిక్సర్) ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్‌ గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (88 బంతుల్లో 70, 5 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనించాడు. కేదార్ జాదవ్ (40) కూడా చివరిలో కాస్త బాగా ఆడాడు.

 

టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. మరోవైపు భారత జట్టులో రెండు మార్పులు జరగగా, చివరి టీ - 20 లో బరిలోకి దిగిన భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా లను జట్టులోకి తీసుకొచ్చారు. విండీస్ జట్టులో మొత్తం ఐదు మార్పులు జరిగాయి. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ కు శుభారంభం ఆశించినంత దక్కలేదు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) త్వరగానే పెవిలియన్‌ కు చేరడంతో భారత్ 25/2 తో నిలిచింది. రాహుల్‌ను కాట్రెల్ చక్కని బంతితో బోల్తా కొట్టించగా, కాట్రెల్ బౌలింగ్‌ లోనే వికెట్ల మీదుకు ఆడుకుని కోహ్లీ క్లీన్ ఔటయ్యాడు. ఈ దశలో రోహిత్ శర్మ (56 బంతుల్లో36, 6 ఫోర్లు)తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ నడిపించేందుకు ప్రయత్నించాడు. మూడో వికెట్‌కు 55 రన్స్ ను జోడించాక రోహిత్ కూడా ఔటయ్యాడు. జోసెఫ్ వేసిన షార్ట్ బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ మిడ్‌ వికెట్‌ లో పొలార్డ్‌కు క్యాచ్ ద్వారా దొరికిపోయాడు.

 


ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్ తో రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ మంచి బంతులను గౌరవిస్తూ, చెత్త బంతుల్ని పెవిలియన్‌ కు పంపించారు. ఈ క్రమంలో అయ్యర్ తొలుత ఫిఫ్టీ (70 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే పంత్ కూడా వన్డేల్లో తన తొలి అర్ధసెంచరీ (49 బంతుల్లో) పూర్తి చేశాడు. అనంతరం నాలుగో వికెట్‌కు 100 పరుగులు జతకలిపారు. కాసేపటికే ఈ జోడీని జోసెఫ్ విడదీశాడు. దీనితో 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 


తర్వాత కొద్దీ సేపటికే పంత్ కూడా భారీ షాట్ ఆడబోయి పెవిలియన్‌‌ కు చేరాడు. స్లాగ్ ఓవర్లలో జాదవ్, జడేజా కాస్త వేగంగా పరుగులు చేయగలిగారు. అయితే భారీ స్కోరు ప్రయత్నించి జాదవ్ ఔట్ అవ్వగా, కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించి జడేజా (21) రనౌటయ్యాడు. చివర్లో శివమ్ దూబే (9) త్వరగా ఔటవగా, దీపక్ చాహర్ (7), మహ్మద్ షమీ (0) క్రీజ్ లో నిలిచారు. విండీస్ బౌలర్లలో అల్జీరీ జోసెఫ్, కాట్రెల్‌, కీమో పాల్‌కు తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: