అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రికెట్ ప్రపంచంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఓడీఐల్లో రెండు కొత్త బంతుల వినియోగానికి సంబంధించిన రూల్‌కి మార్పును ఆమోదించింది. అదే సమయంలో మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కాన్కషన్ సబ్‌స్టిట్యూట్‌కు నిబంధనలను అమలు చేయనుంది. ఈ మార్పులు జూన్ 17 నుంచి టెస్టులకు, జూలై 2 నుంచి ఓడీఐలకు, జూలై 10 నుంచి టీ20లకు అమల్లోకి రానున్నాయి.

ఇప్పటి వరకూ ఓడీఐలలో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే రెండు కొత్త బంతులు ఒక్కో దిక్కు ఒక్కటి ఉపయోగించేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం, రెండు బంతులను మొదటి 34 ఓవర్ల వరకే ఉపయోగించాలి. 34వ ఓవర్ అనంతరం బౌలింగ్ జట్టు రెండింటిలో ఒక బంతిని ఎంపిక చేసుకోవాలి. మిగిలిన 16 ఓవర్లను అదే బంతితో ఇన్నింగ్స్ ముగింపు వరకు కొనసాగించాలి. ఒకవేళ మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్రతి జట్టుకు 25 ఓవర్లకు కుదించినట్లయితే, ఆ ఇన్నింగ్స్ మొత్తానికి ఒకే కొత్త బంతి ఉపయోగించాలి.

అలాగే ఇకపై టీములు మ్యాచ్‌కు ముందు మేచ్ రిఫరీకి ఐదు రకాల ప్లేయర్లను ప్రత్యేకంగా సూచించాలి. అందులో ఒక వికెట్ కీపర్, ఒక బ్యాటర్, ఒక పేస్ బౌలర్, ఒక స్పిన్ బౌలర్, ఒక ఆల్‌రౌండర్. వీరిని మాత్రమే కాన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగించాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరణగా నిలిచిన సంఘటనలో ఈ సంవత్సరం జనవరిలో జరిగిన భారత, ఇంగ్లాండ్ నాల్గవ టీ20లో శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రాణా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చారు. హర్షిత్ మూడు వికెట్లు తీయడంతో అది వివాదాస్పదమైంది.

ఈ నూతన నిబంధనల వల్ల ఇలాంటి అపార్థాలు తొలగిపోతాయని భావిస్తున్నారు. అలాగే, సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు కూడా కాన్కషన్ వచ్చినట్లయితే, ‘లైక్ ఫర్ లైక్’ నిబంధన మేరకు రిఫరీ మరొకరిని ఎంపిక చేసే అవకాశముంటుంది. అలాగే మెరిలీబోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఒక కీలకమైన మార్పు చేసింది. బౌండరీకి వెలుపల ‘బన్నీ హాప్’ చేసి క్యాచ్ పట్టే ప్రయత్నాన్ని ఇకపై అనుమతించరని ప్రకటించింది. ఈ మార్పులతో క్రికెట్ మరింత పారదర్శకంగా, న్యాయంగా, వివాదాల నుండి దూరంగా సాగుతుందని ఐసీసీ ఆశిస్తోంది. మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారే అవకాశమూ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

icc