ప్రస్తుత కరోనా కాలంలో ప్రజలంతా ఉపయోగిస్తున్న వీడియో కాలింగ్ యాప్ జూమ్. పెద్ద పెద్ద సంస్థల నుంచి చిన్న పిల్లల ఆన్‌లైన్ తరగతుల వరకూ అన్నిటికీ ఇదే వేదికలా మారింది. అయితే జూమ్‌లో ఉచితంగా వీడియో కాలింగ్ చేయాలంటే అది 40 నిమిషాలకే పరిమితం. ఆ తర్వాత కూడా వీడియో కాల్ కంటిన్యూ చేయాలంటే కచ్చితంగా పైకం చెల్లించుకోవాల్సిందే. అయితే పాశ్చాత్యులకు ఎంతో ప్రాధాన్యమున్న ‘థాంక్స్ గివింగ్ డే’ నాడు ఈ పరిమితిని తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు జూమ్ ప్రకటించింది.

ఆ ఒక్క రోజు మాత్రం జూమ్ వినియోగదారులు ఎంత సేపైనా ఉచితంగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చని ప్రకటించింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ మరో కొత్త బాంబ్ పేల్చింది. తాము ప్రత్యేకంగా ఓ వీడియో కాలింగ్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో మరో విశేషం ఏంటంటే.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ ద్వారా వస్తున్న ఈ ఫీచర్‌లో మనం ఉచితంగా 24 గంటలూ వీడియో కాల్స్ మాట్లాడుతూనే ఉండొచ్చు. అలాగే ఒకేసారి 300మందితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చట. తెరపై వరుసగా 49 మంది పార్టిసిపెంట్స్‌ను చూడొచ్చట.

మైక్రోసాఫ్ట్ టీమ్స్ తెస్తున్న ఈ ఫీచర్ కేవలం జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ సాఫ్ట్‌వేర్లతో పోటీ కోసమేనని నిపుణులు అంటున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ టీమ్స్ నుంచి ఓ బ్లాగ్ పోస్ట్ కూడా వచ్చింది. ‘రాబోయే కాలంలో మీ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండటం కోసం సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్నాం. దీంతో మీరు 24 గంటలూ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఒక్కో కాన్ఫరెన్స్‌లో 300 మంది పాల్గొనవచ్చు’ అని ఈ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. ఏదేమైనా మైక్రోసాఫ్ట్ టీమ్స్ తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో జూమ్ వంటి కంపెనీలకు చెక్ పడ్డట్లే అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ ఫీచర్ ఎంత బాగా క్లిక్ అవుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: