ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని నానా అవస్థలు పడుతున్నాయి. కోట్ల మంది దీనీ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా బారిన పడిన వారికి డాక్టర్లు సూచించే ఔషధాలలో రెమెడిస్విర్ ఒకటి. ఇది కరోనా నియంత్రణలో ప్రపంచదేశాలు సైతం వినియోగిస్తున్న ఔషధం. అయితే తాజాగా ఈ ఔషధం ఆన్‌లో యూజ్‌డ్ వస్తు విక్రయ మాధ్యమం.. ఓఎల్ఎక్స్‌లో దర్శనమిచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రెమెడిస్విర్‌ను ఓఎల్ఎక్స్‌లో పెట్టి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఒకవైపు చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ కొరత ఉన్న నేపథ్యంలో ఇలా ఓఎల్‌ఎక్స్‌లో ఈ ఔషధం కనిపించడం కలకలం రేపుతోంది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఈ ఔషధ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలోనే అందరికీ సరిపడా ఔషధాలు అందించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం ఆలోచన ఎలా ఉన్నా బ్లాక్ మార్కెట్లో మాత్రం కోవిడ్ డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుజరాత్‌, మహారాష్ట్రకు చెందిన పలువురు ఓఎల్‌ఎక్స్‌ యూజర్లు ఈ ఇంజెక్షన్లను వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో వాయెల్‌ను గరిష్ఠంగా రూ.6వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓఎల్‌ఎక్స్‌లో ఎలాంటి మెడిసిన్ల విక్రయానికి అనుమతిలేదు. అలాంటిది కొవిడ్‌ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ను ఈ వెబ్‌సైట్లో విక్రయిస్తుండటం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలో రెమెడిస్విర్ ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉంది. ఇక్కడ ప్రతి రోజూ వేల కేసులు నమోదవుతుండడంతో వారికి సరిపడా ఔషధాలను అందించడం అధికారులకు పెద్ద ఇబ్బంది మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే బ్లాక్‌ మార్కెట్‌లో వీటి‌ విక్రయాలు జోరుగా సాగుతుండటం గమనార్హం. అంతేగాక, డిమాండ్‌ పెరుగుతుండడంతో కొందరు నకిలీ ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: