మహిళలు బంగారాన్ని ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న వయసు నుండి పెద్ద వయసు దాకా ప్రతి ఒక్కరి మనసులో బంగారంపై ఒక ప్రత్యేకమైన మమకారం ఉంటుంది. కొత్త డిజైన్లు, కొత్త మోడల్స్ వస్తే వెంటనే వాటిని చూసి మంత్రముగ్ధులవుతారు. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారాన్ని ఒక ఆభరణం మాత్రమే కాకుండా, ఆత్మగౌరవానికి, కుటుంబ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. మన భారతీయ సంప్రదాయంలో బంగారం  మహిళల జీవితంలో అంతర్భాగంగా మారింది.ప్రతి మహిళకు ఎన్ని బంగారు నగలు ఉన్నా, ఇంకా ఇంకొన్ని కావాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. కొత్త మోడల్ వస్తే వెంటనే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలని ఆతృత చూపిస్తారు. వివాహాలు, పండుగలు, శుభకార్యాల సందర్భాల్లో ఒంటినిండా బంగారు నగలు ధరించి మెరవడం మహిళలకు సహజమైన ఆనందం. అయితే ఇప్పుడు ఆ ఆనందానికి కొంత బ్రేక్ వేసేలా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు జనాలు.  మహిళలు బంగారం ఆభరణాలు ధరించడంపై వికాస్‌ నగర్-జాన్సార్ బవార్‌లోని కందద్, ఇంద్రోలి గ్రామాలు చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. కందద్, ఇంద్రోలి గ్రామాల్లోని మహిళలు వివాహాలు, శుభకార్యాల సమయంలో మూడు బంగారు నగలు మాత్రమే ధరించాలని కందద్ గ్రామ పంచాయతీ నిర్ణయించింది.
 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలోని రెండు గ్రామాలు ఇటీవల ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఆ గ్రామాల్లోని మహిళలు కేవలం మూడు బంగారు ఆభరణాలు – అంటే ముక్కుపడక, సరుడు, కమ్మలు మాత్రమే ధరించాలంటూ నిర్ణయించారు. ఏ సందర్భం అయినా, ఏ ఫంక్షన్ అయినా – ఈ నియమం తప్పనిసరిగా పాటించాలనే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు గ్రామ పెద్దలు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “మహిళలు మూడు బంగారు నగలు మాత్రమే ధరించాలి” అనే ఈ నియమం వేగంగా ట్రెండ్ అవుతోంది. దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అక్కడి మహిళలు ప్రతి శుభకార్యానికి, ప్రతి పండుగకు, బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇకపై ఎవరికైనా మూడు నగలకంటే ఎక్కువ బంగారు ఆభరణాలు వేసుకుంటే, వారికి ₹50,000 వరకు జరిమానా విధించనున్నారు.



ఈ నిర్ణయానికి వెనుక ఉన్న ఉద్దేశం చాలా సానుకూలంగా ఉంది. గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు చెబుతున్నట్టు, కొంతమంది మహిళలు ఎక్కువ బంగారు నగలు ధరించడం వలన, తక్కువ ఆభరణాలు ఉన్న ఇతర మహిళల్లో తారతమ్య భావన కలుగుతుందని చెప్పారు. ఇది గ్రామంలో ఆర్థిక అసమానతలను పెంచుతుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. “ఆడంబరాలకు పోకూడదు, సమానతను కాపాడాలి” అనే నినాదంతో గ్రామస్థులు ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గ్రామంలోని చాలా మంది మహిళలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. “ఇది మంచి ఆలోచన. ఇకపై ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేది ఉండదు. అందరం సమానంగా కనిపిస్తాం” అని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడం, ఆడంబరాల ప్రదర్శనను అరికట్టడం, సామాజిక సమతుల్యతను పెంచడం వంటి లక్ష్యాలతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తే ఎంత బాగుంటుందో అని చాలా మంది సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఉత్తరాఖండ్‌లో మొదలైన ఈ ‘మూడు బంగారు నగల నియమం’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఇది కేవలం ఒక నియమం మాత్రమే కాదు — ఆడంబరాలపై నియంత్రణ, సమానత్వానికి సంకేతంగా నిలిచే ఒక కొత్త ఆలోచనగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: