మాతృత్వపు మమకారం మాటలకు అందనిది. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. అమ్మ పాత్ర కుటుంబ వ్యవస్థలో అత్యంత కీలకం. అంటూ ఎంతగా అభివర్ణించినా అది తక్కువే.. నేటి నవ నాగరిక యుగంలో అమ్మ సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. ఒకప్పుడు ఆమె వంటింటికే పరిమితమైతే నేడు ఆమె బాధ్యతలు ఎన్నెన్నో..  గృహిణిగా, ఉద్యోగినిగా ఆమె సేవలు అనన్య సామాన్యం..

 

ఆత్మీయతలు, ఆధునికతల నడుమ అనుక్షణం సతమతమవుతున్నా ఆమెలోని ఆత్మవిశ్వాసం అపారం, అమోఘం.ఎన్ని ఒత్తిళ్లు చుట్టుముట్టినా ఇంటాబయటా నేర్పుతో, సహనంతో, సంకల్పబలంతో అడ్డంకులను అధిగమిస్తోంది.. ఇంటి బాధ్యతలు, ఉద్యోగం, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ- ఇవేవీ కుటుంబ పాలనలో అమ్మకు అవరోధం కావు...

 

 

కుటుంబ వ్యవస్థకు ‘అమ్మ’ ఓ తిరుగులేని సీఈఓ. ఆర్థిక వ్యవహారాల్లో శిక్షణ లేకున్నా, ఎంబీఏలు-ఎంటెక్‌లూ చదవకపోయినా అమ్మను మించిన ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ నిజానికి ఎవరూ లేరు. చిన్న ఇల్లే ఆమెకు అతిపెద్ద సామ్రాజ్యం. దానికి ఆమే సామ్రాజ్ఞి. ఆమె పాలనలో ఇల్లంతా చల్లగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా నిరంతరం నిశ్చింతగా ఉంటారు. ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తనే కొంగు బిగిస్తుంది. ఆకాశమంత విశాల భావాలు, సాగరమంత లోతైన ఆలోచనలు, అవనిని మరపించే క్షమాగుణం, సంక్షోభాల్లో సడలని విశ్వాసం- అమ్మకు పెట్టని ఆభరణాలు.

 

ఆమెలో సహజమైన నాయకత్వం, ఆ నాయకత్వంలో అంతులేని మాతృత్వపు మమకారం ఉంటుంది.  ప్రతీ వ్యూహంలో, నిర్ణయంలో ఆమె ప్రతిభ ప్రతిఫలిస్తుంది.. అద్భుతమైన ఇలాంటి ప్రతిభ, నైపుణ్యం ‘అమ్మ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్’లో తప్ప మనం ఇంకెక్కడా చూడలేం.. ఒంట్లో ఓపిక లేకున్నా, ఇంట్లో ఏదీ లేకున్నా ‘నావల్ల కాదు’ అని ఆమె ఎప్పుడూ నిస్తేజంగా, నిస్సహాయంగా ఉండిపోదు. ఉన్న దాంతోనే వండి ఇంటిల్లిపాదికీ వడ్డించడంలో ఆమె నేర్పు- ఏ మేనేజ్‌మెంట్ కోర్సులోనూ ఉండదు.. ఆ మమకారానికి ముగింపు లేదు, ఆ సేవకు విశ్రాంతి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: