అమరావతి: ఒక్కోసారి అనుకోని సంఘటనలు జీవితాలనే తలకిందులు చేస్తుంటాయి. కుటుంబాలను రోడ్డున పడేస్తుంటాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండంలో ఇలాంటి సంఘటనే జరిగింది. కేవలం రూ.50 విషయంలో వచ్చిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. దీంతో అతడి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. భర్తలేని వారి జీవితాలు చీకటి మయమయ్యాయి.

 పట్టణ ఎస్‌ఐ ఏ రఘుపతిరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్థానిక పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ బాజి(27) ఆటోనగర్‌‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. రాత్రిపూట శ్రీలక్ష్మీ మారుతి పాల ఉత్పత్తుల విక్రయ దుకాణంలో పనిచేస్తున్నారు. 15 రోజుల కిందట రాత్రి ఇదే ప్రాంతానికి చెందిన యువకుడు పల్లపు కోటివీరయ్య పాల దుకాణానికి వచ్చాడు. సిగరెట్లు, నీళ్లసీసా తీసుకున్నాడు. దానికి బిల్లు రూ.50 కావడంతో ఆ మోత్తాన్నీ ఫోన్‌పే చేశాడు. అయితే నగదు వారి ఖాతాకు రాలేదు. దీంతో చెల్లింపు జరగలేదని దుకాణ యజమాని పెండ్లి వైకుంఠవాసు చెప్పాడు. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్‌లో పడిందని, ఒకవేళ రాకుంటే ఉదయం ఇస్తానని చెప్పి కోటివీరయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఉదయానికి కూడా ఆ నగదు రాలేదు. కోటివీరయ్య కూడా వచ్చి చెల్లించలేదు. దీంతో నాలుగు రోజుల క్రితం కోటివీరయ్య తమ్ముడు నాగేశ్వరరావు వారి దుకాణానికి రావడంతో బాజి అతడిని రూ.50 ఇవ్వాలని అడిగాడు. అతడు ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. రెండో రోజు కూడా బాజీ మళ్లీ నాగేశ్వరరావునే డబ్బులు అడిగాడు. దీంతో వాటినిచ్చి కోపంగా ఇంటికి వెళ్లిపోయాడు నాగేశ్వరావు.

ఆ మరుసటి రోజు కోటివీరయ్య దుకాణానికి వచ్చి యజమాని వాసు, సేల్స్‌మెన్ బాజీలపై మండిపడ్డాడు. తాను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తన తమ్ముడిని ఎందుకు అడిగారని వారిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య రోడ్డుపై గొడవ జరిగింది. ఈ క్రమంలో యజమాని వాసును దుకాణంలోకి తీసుకొచ్చిన బాజి.. బయట ఉన్న కోటివీరయ్య, నాగేశ్వరరావు, వారి స్నేహితుడు తిరుమల్లేశ్వరరావు అలియాస్‌ పప్పుతో మాట్లాడేందుకు వెళ్లాడు. అయితే అతడితో మాట్లాడడానికి బదులు వారు బాజీపై దాడి చేశారు. ఈ క్రమంలో బాజీ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే వారు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బాజీ ఆ రోజు రాత్రే మరణించాడు.

తన భర్త మరణించాడని తెలియగానే బాజీ భార్య సైదాబి హతాశురాలైంది. భోరున విలపించింది. తనను,తన బిడ్డలను అనాథలను చేసి బాజీ వెళ్లిపోయాడని, ఇప్పుడు తాను ఎలా బతకాలని రోదించింది. ఆమె రోదనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే సైదాబీ తన భర్త మృతికి పల్లపు కోటివీరయ్య, నాగేశ్వరరావు, తిరుమల్లేశ్వరరావు, పాల దుకాణం నిర్వాహకులు పెండ్లి వైకంఠవాసు, లక్ష్మీమారుతి, పండ్ల వ్యాపారి షేక్‌ మహబు అలియాస్‌ సుప్రీం కారణమని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆ ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. బాజి, సైదాబిలకు అహిల్‌(3), అమీర్‌(1) ఇద్దరు కొడుకులున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: