విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో ఖగేష్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ ‘రా అండ్ రస్టిక్’ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో పరిశీలిద్దాం.


కథనం : అనకాపల్లి నేపధ్యంలో నడిచే ఈ కథలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) తిరుగులేని రౌడీగా తన నెట్‌వర్క్‌ను నడుపుతుంటాడు. అతడికి స్థానిక డ్రగ్ డీలర్ నాయుడు (కాండ్రేగుల నాయుడు)తో తీవ్ర శత్రుత్వం ఉంటుంది. అదే ఊరిలో విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసే సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్). తండ్రి నిజాయితీ, సగటు మిడిల్ క్లాస్ జీవితం నచ్చని సూర్య, బుల్లెట్ మాస్ యాటిట్యూడ్‌కి ఆకర్షితుడై అతడి గ్యాంగ్‌లో చేరుతాడు. తన తెగింపుతో కొద్దిరోజుల్లోనే బుల్లెట్‌‌కి కుడిభుజంగా ఎదుగుతాడు.

ఇదిలా ఉండగా, విద్యుత్ మీటర్ సమస్యపై వచ్చిన అమృత (సంధ్య వశిష్ట)తో సూర్యకి పరిచయం ఏర్పడి, అది కాస్తా గాఢమైన ప్రేమగా మారుతుంది. అంతా అనుకూలంగా సాగుతోందనుకున్న తరుణంలో సూర్య జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. తాను ఆరాధించే రౌడీ బుల్లెట్, తాను ప్రాణంగా ప్రేమించిన అమృతతో కలసి ఉండటం సూర్య చూస్తాడు. అసలు అమృత, బుల్లెట్‌‌ల మధ్య ఉన్న బంధమేంటి? ఆ నిజం తెలిసాక సూర్య ప్రేమ కథ ఏ తీరానికి చేరింది? ఈ ప్రయాణంలో సూర్య తల్లి జయంతి (ఇంద్రజ), ఎమ్మెల్యే (శ్రీనివాస్ వడ్లమాని)ల పాత్ర ఏంటి అనేది మిగతా కథ.


విశ్లేషణ : ‘అనకాపల్లి’ కేవలం ఒక రొటీన్ రివేంజ్ డ్రామా మాత్రమే కాదు; ఇందులో ఎన్నో సామాజిక, భావోద్వేగ కోణాలు దాగి ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలతో తప్పుదారి పట్టిన ఒక యువకుడి జీవితం ఎలా అంధకారమవుతుంది.. కత్తి పట్టిన వాడు కత్తికే బలికాక తప్పదనే కఠిన సత్యం.. పిల్లల తప్పుడు మార్గాల వల్ల మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు అనుభవించే మానసిక నరకం.. ఆకర్షణకి, నిజమైన ప్రేమకి మధ్య ఉన్న వ్యత్యాసం.. ఇలాంటి కీలక అంశాలను కథలో చాలా సహజంగా మిళితం చేశారు. త్రినాథరావు అందించిన బలమైన కథకు, దర్శకుడు ఖగేష్ తన మేకింగ్‌తో పూర్తి న్యాయం చేశారు. కథనం అక్కడక్కడా కాస్త మందగించినా, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు మాత్రం ప్రేక్షకుడికి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

ఫస్ట్ హాఫ్ అంతా బుల్లెట్ రౌడీయిజం, సూర్య ఎదగడం, హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్‌తో సాధారణ మాస్ సినిమాగా అనిపించినప్పటికీ, ఇంటర్వెల్ ట్విస్ట్ కథ గమనాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. ఆ ఊహించని షాక్ ప్రేక్షకులపై బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సెకండాఫ్ అంతా తీవ్రమైన ఎమోషనల్ అండ్ రివేంజ్ డ్రామాగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ ముగిసిందనుకునే లోపే వచ్చే మరో సర్ ప్రైజింగ్ బ్లాక్ హృదయాలను పిండేస్తుంది. ప్రేమకు ఒక అర్థవంతమైన నిర్వచనంతో కథకు శుభం కార్డ్ వేస్తారు.


నటీనటుల ప్రతిభ

  • విక్రమ్ సహిదేవ్: సూర్య పాత్రలో వైవిధ్యభరితమైన నటన కనబరిచాడు. యాక్షన్, లవ్, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని ఎమోషన్లను చక్కగా పండించాడు.

  • తారక్ పొన్నప్ప: విలన్ బుల్లెట్‌గా తన మాస్ యాటిట్యూడ్, పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో స్క్రీన్ పై భయపెట్టేసాడు.

  • సంధ్య వశిష్ట: అనకాపల్లి అమ్మాయిగా తన పాత్రలో ఒదిగిపోయి చాలా సహజమైన నటనను ప్రదర్శించింది.

  • ఇతర నటులు: తండ్రిగా త్రినాథరావు, తల్లిగా ఇంద్రజలు మధ్యతరగతి తల్లిదండ్రుల ఆవేదనను, ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించి కంటతడి పెట్టించారు. డ్రగ్స్ డాన్‌గా కాండ్రేగుల నాయుడు, మిగతా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.


సాంకేతిక విభాగం సాంకేతికంగా ‘అనకాపల్లి’ ప్రేక్షకులను నేరుగా ఆ ఊరి వాతావరణంలోకి తీసుకెళ్తుంది. పక్కా విలేజ్ డ్రామా నేటివిటీ ఏమాత్రం దెబ్బతినకుండా కెమెరా వర్క్, డైలాగ్స్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్ ప్రతీదీ కథా కాలానికి తగ్గట్లు సరిగ్గా కుదిరాయి. నిర్మాతలుగా తొలి అడుగులోనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమాను నిర్మించి విజయం సాధించారు.

రేటింగ్: 3 / 5

మరింత సమాచారం తెలుసుకోండి: