ధర్మపురి శ్రీనివాస్.. కాంగ్రెస్‌లో ఒకప్పుడు బాగా చక్రం తిప్పిన నేత.. పీసీసీ అధ్యక్షుడుగా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి పేరున్న నాయకుడు. అలాంటి నాయకుడు కొన్నాళ్ల క్రితం టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ప్రస్తుతం ఆయన వయస్సు బాగా పెరిగింది. 73 ఏళ్ల వయస్సు పెద్ద వయసేమీ కాకపోయినా.. ఆయన అంత ఆరోగ్యంగానూ లేరు.. ఓ పదేళ్ల క్రితం నుంచే ఆయన ఎవరి సాయం లేకుండా వేదిక ఎక్కగలిగిన పరిస్థితి లేదు. అలాంటి నేత ఈ వయస్సులో జంపింగుల గురించి ఆలోచిస్తున్నారు.


కొన్నాళ్ల క్రితం తెలంగాణలో కాంగ్రెస్‌ కు పెద్దగా ఫ్యూచర్ ఉండబోదన్న అంచనాతో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్లో కేసీఆర్ కాంగ్రెస్‌ నేతలను టార్గెట్ చేసి మరీ తన పార్టీలో చేర్చుకున్నారు. ఆ పరంపరలోనే డీఎస్‌ కూడా టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. దానికి ప్రతిఫలంగా డీఎస్‌కు రాజ్యసభ సీటు ఇచ్చారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన సీఎం హోదాలో స్వయంగా డీఎస్‌ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లేదనుకుంటున్నారో లేక.. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని భావిస్తున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ డీఎస్‌ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.


ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలోనే రెండు పార్టీల నేతలు ఉండటం కూడా కేసీఆర్‌ తో డీఎస్‌ విబేధాలకు కారణంగా భావించాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్‌ కుమారుడు ధర్మపురి అరవింద్‌ బీజేపీ టికెట్‌పై నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో కవితను ఓడించారు. కవిత ఓటమి తర్వాత డీఎస్‌ పరిస్థితి పార్టీలో మరీ దయనీయంగా మారింది. దీంతో డీఎస్‌ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకోవడంతో ఇప్పుడు పక్కదారులు చూస్తున్నారేమో అనిపిస్తోంది.


అయినా ఇప్పటికే కాంగ్రెస్‌లో అనేక ఉన్నత స్థానాలు పొందిన డీఎస్‌ రాజకీయ చరమాంకంలో ఇలాంటి జంపింగులు అవసరమా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజకీయంలో ఉండే మజా అదేనేమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: