డ్రాగన్ దేశం అనుకున్నంత పనీ చేస్తోంది. భారత్ ను అన్నీ వైపుల నుండి కమ్ముకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మనదేశంపై ఒత్తిడి పెంచేందుకు పాకిస్ధాన్ తో బహిరంగంగా  చేతులు కలిపింది.  సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడే తూర్పుదిశగా తమ సైన్యాన్ని మోహరిస్తున్న డ్రాగన్ అదే సమయంలో ఉత్తరదిశగా పాకిస్ధాన్ సైన్యాన్ని మోహరించేట్లుగా ప్లాన్ చేసింది. అంటే రెండువైపులా రెండు శతృదేశాల సైన్యాలు భారీగా లడ్డాఖ్ తదితర ప్రాంతాల్లో మోహరిస్తున్నాయి. ఇదంతా చైనా ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమనే రక్షణరంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వాస్తవాధీన రేఖ వెంబడే చైనా, పాకిస్ధాన్ సైన్యాలు చేస్తున్న విన్యాసాలను భారత్ 24 గంటలూ గమనిస్తునే ఉంది.

 

పాకిస్ధాన్ లోని ఉగ్రవాద సంస్ధ అల్ బదర్ నేతలతో చైనా సైనికాధికారులు మంతనాలు జరిపినట్లు మన ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దాంతో సైన్యం మొత్తం మరింతగా అప్రమత్తమయ్యింది. లడ్డాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడే ఉత్తరం దిశగా గిల్గిగ్ బాల్టిస్ధాన్ ప్రాంతంలో పాకిస్ధాన్ సుమారు 20 వేలమంది సైనికులను మోహరించింది. ఈ ప్రాంతంలో పాకిస్ధాన్ కు చెందిన రాడార్లు పూర్తిస్ధాయిలో పనిచేస్తున్నట్లు మన నిపుణులు గుర్తించారు. జమ్మూ-కాశ్మీర్ విభజన తర్వాత గిల్గిట్ బాల్టిస్ధాన్  ప్రాంతమంతా లడ్డాఖ్ పరిధిలోకి వచ్చింది. అంటే మనదేశంలో కలిసిపోయింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతమంతా పాకిస్ధాన్ ఆక్రమణలో ఉంది.

 

వాస్తవాధీన రేశ తూర్పుదిశగా చైనా 20 వేలమంది సైనికులను రంగంలోకి దింపితే తూర్పు వైపున పాకిస్ధాన్ కూడా అంతే సంఖ్యలో 20 వేలమందిని మోహరించింది. అదే సమయంలో చైనా పీపుల్స్ లిజరేషన్ ఆర్మీకి చెందిన మరో 12 వేలమంది సైనికులు  సరిహద్దులకు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉత్తర జిన్ జియాంగ్ ప్రాంతంలో మోహరించున్నారు. ఏ సమయంలో అయినా సరే సరిహద్దులకు చేరుకోవటానికి సకల సన్నాహాలతో రెడీ ఉంది పీపుల్స్ ఆర్మీ సైన్యం. సరే శతృదేశాలు ఎంతటి సన్నాహాలు చేస్తున్నా మనదేశం కూడా అన్నింటికీ ధీటుగా సమాధానం చెప్పటానికి రెడీగానే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉధ్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, డ్రాగన్, పాకిస్ధాన్ సైన్యాల కదలికలను గమనించిన మన సైన్యాధికారులు కూడా భారీ ఎత్తున సైన్యాన్ని సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు.

 

రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నుండి సంపాదించిన అత్యంతాధునిక యుద్ధ ట్యాంకులు, అపాచి యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్ యుద్ధ విమానాలతో సరిహద్దుల్లో గస్తీ కాస్తోంది. లేహ్, లడ్డాఖ్ ప్రాంతంలో కాపలాగా 24 గంటలూ చినూక్ హెలికాప్టర్లు కాపలాకాస్తున్నాయి. ప్యాంగ్యాంగ్ నదీ సరిహద్దుల్లో కాపలా కాసేందుకు నేవీదళాలు రంగంలోకి దిగాయి. లడ్డాఖ్ ప్రాంతంలో డజనుకుపైగా ఉక్కు పడవలను మనదేశం మోహరించింది. ఇప్పటికే ఇక్కడ చైనాకు చెందిన టైప్ 928 బి యుద్ధ నౌకలు రెడీగా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో  శతృదేశాలు చైనా, పాకిస్ధాన్ సైన్యాలు చేస్తున్న కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఆర్మీకి కేంద్రప్రభుత్వం సర్వాధికారాలను కట్టబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఏ నిముషంలో సరిహద్దుల్లో ఏమవుతుందో ఎవరికీ తెలియనంతగా టెన్షన్ పెరిగిపోతోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: