బాక్సాఫీస్ వద్ద 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') సినిమా జోరు జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యని చాలా కాలంగా ఊరిస్తున్న భారీ కమర్షియల్ విజయం ఎట్టకేలకు ఈ సినిమాతో దక్కింది. మొదటి వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొంత నెమ్మదించినప్పటికీ, ప్రధాన కేంద్రాల్లో మాత్రం ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమాల కరువు ఏ స్థాయిలో ఉందో 'వీరభద్రుడు' సాధిస్తున్న వసూళ్లు చూస్తే అర్థమవుతోంది.
ఇదంతా బాగానే ఉన్నా, ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఒక పొరపాటును చిత్ర బృందం చాలా త్వరగానే గుర్తించి సరిదిద్దుకుంది.
అసలేం జరిగిందంటే?
సినిమాలోని ఒక సీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో దివంగత నటుడు విజయ్‌కాంత్ సినిమా పాట ఒకటి వస్తుంది. ఈ పాటకు లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు అందించారు. అయితే ఈ సీన్ లో దర్శకుడు ఆర్జే బాలాజీ, ఇళయరాజాను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా ఒక కౌంటర్ డైలాగ్ రాశారు. ముఖ్యంగా పాటల హక్కుల (కాపీరైట్స్) కోసం ఆయన పోరాడే విధానంపై ఒక వ్యంగ్య మాట ఉంటుంది.
ఇళయరాజా కాపీరైట్స్ విషయంలో కోర్టుకు వెళ్లిన ప్రతిసారీ చట్టపరంగా విజయం సాధిస్తూనే వచ్చారు. అలాంటిది, ఆయన ఏదో చేయకూడని పని చేస్తున్నారనే తరహాలో సినిమాలో కామెడీ చేయడం ఇళయరాజా అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. సోషల్ మీడియాలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
వెంటనే స్పందించిన మేకర్స్:
ఈ వివాదాన్ని గమనించిన నిర్మాణ సంస్థ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పు తెలుసుకుంది. వెంటనే ఆ వివాదాస్పద సీన్‌ను సినిమా నుండి మార్చడానికి సిద్ధమవడమే కాకుండా, ఇళయరాజాకు క్షమాపణలు తెలుపుతూ ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. నిజానికి కథ, సన్నివేశాలు రాసే స్టేజిలోనే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇళయరాజా లాంటి గొప్ప మ్యూజిక్ కంపోజర్ కోలీవుడ్‌కు దక్కిన వరం. ప్రపంచవ్యాప్తంగా ఆయన సంగీతానికి, పాటలకు ఇప్పటి తరం కుర్రాళ్లలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటి విద్వాంసుడి వయసుకు, ప్రతిభకు గౌరవం ఇవ్వకుండా ఏదో పంచ్ డైలాగ్ వేశామని ఫీలయితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ‘సారీ’ చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.
సూర్య ఖాతాలో బ్లాక్‌బస్టర్:
మరోవైపు సినిమా సాధిస్తున్న కలెక్షన్ల పట్ల హీరో సూర్య ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత తన సినిమా కమర్షియల్ గా ఇంతటి ఘనవిజయాన్ని సాధించడం చూసి ఆయన భావోద్వేగానికి గురవుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే 'దేవుడి పూనకం' ఎపిసోడ్‌కు థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. తమిళ సంస్కృతిలో 'కరుప్పు స్వామి' అంటే ప్రజలకు అపారమైన భక్తి, ఆరాధనాభావం ఉంటాయి. ఆ సెంటిమెంట్‌ను దర్శకుడు పర్ఫెక్ట్‌గా కనెక్ట్ చేయడమే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి