ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి 'మక్కల్ నీది మయ్యం' పార్టీని ఒక్కొక్కరే వీడిపోతున్నారు. అందరికంటే ముందుగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వెళ్తే వెళ్లారు కానీ కమల్ హాసన్ పై ఆయన చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కమల్ హాసన్ కి పార్టీ నడపడం చేతకాదని, పార్టీలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సరిదిద్దే సత్తా కమల్ దగ్గర లేదని చెబుతున్నారు. పార్టీని ఇలాగే నడుపుతుంటే ఇక ఎప్పటికీ గెలవలేదంటూ వ్యాఖ్యానించారు. అయితే మహేంద్రన్ వ్యాఖ్యలపై ఇంతవరకు కమల్ హాసన్ స్పందించకపోవడం గమనార్హం.
తాజాగా కమల్ పార్టీకి మరో ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు వెల్లడించినా, కమల్ నాయకత్వంపై నమ్మకం లేక, ఇక పార్టీకి భవిష్యత్ లేదని నిర్ణయించుకున్న తర్వాతే బయటకు వెళ్లారని తెలుస్తోంది. కమల్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో మాజీ ఐఏఎస్ సంతోష్ బాబు, సామాజికవేత్త పద్మప్రియ కూడా ఉన్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్ర తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరించింది సంతోష్ బాబే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం తరఫున పోటీచేసిన వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. చివరకు పార్టీని వీడారు. కమల్ పై నిందలు వేశారు. అటు కమల్ హాసన్ కూడా ఓటమితో తీవ్ర నిరాశ చెందారని, ఆయన ఇక సినిమాలకే పరిమితం అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి