మనిషన్నాక కాస్త మానవత్వం ఉండాలి. ఉపాధి కోసం ఎంత గడ్డి అయినా కరవడం ఇవాళ్టి సమాజంలో సాధారణమే కానీ.. మరీ దారుణంగా.. శవాలను అడ్డం పెట్టుకుని కాసులు సంపాదించుకోవడం అరాచకం.. అనాగరికం.. అకృత్యం.. కానీ.. ప్రభుత్వాసుపత్రుల వద్ద అదే జరుగుతోంది. మొన్నటికి మొన్న తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జరిగిన ఘటన యావత్‌ ఆంధ్ర దేశాన్ని నివ్వెర పరిచింది. ఓ పిల్లవాడి మృతదేహాన్ని తరలించేందుకు ఏకంగా 20వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ దందా అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఆ తర్వాత నెల్లూరులోని ఓ ఆసుపత్రి వద్దా అదే తరహా ఘటన.. ఓవైపు తమ వాడు చనిపోయిన బాధలో ఉన్నా.. వాళ్లను ఇదే అదనుగా పీక్కుతినే రాబందులు పెరిగారు. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ వద్దా అదే పరిస్థితి.. ఇక్కడ ఏకంగా ఇలాంటి ఓ ఏజెంటుకు వ్యతిరేకంగా  ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లే నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో సార్జంట్ గా పనిచేస్తోన్న విశ్వనాధం అనే వ్యక్తి అరాచకంగా వ్యవహరిస్తున్నాడంటున్నా ఆటో డ్రైవర్లు.


గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ సార్జంట్ విశ్వనాధంపై ఏకంగా  గుంటూరు ఎస్పీకి అంబులెన్స్ డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి నుంచి శవాలను తీసుకువెళ్లాలంటే  ఈ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ సార్జంట్ విశ్వనాధం ఏకంగా 20 శాతం వరకు కమీషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. ప్రభుత్వ విధించిన ఛార్జీలే తాము వసూలు చేస్తున్నామని... ఇరవై శాతం కమీషన్ ఇవ్వలేమంటూ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.


తమకు కమీషన్ ఇవ్వకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ సార్జంట్ విశ్వనాధం.. బయట నుండి అంబులెన్సులు పిలిపిస్తున్నాడట. అంతే కాదు.. ఆయనే ఓ సొంత వాహనాన్ని వినియోగిస్తున్నారట. కమీషన్ ఇవ్వడం లేదని ఏకంగా గేటు పాస్ విధానాన్ని తీసుకొచ్చారని డ్రైవర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: