జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కొత్త కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలియజేసేలా 'జన వాణి'  పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజలు, వివిధ వర్గాల సమస్యలను విని... వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతారట. దీన్ని తొలిసారిగా జులై 3వ తేదీన విజయవాడలో  నిర్వహిస్తారట.


'జన వాణి' కార్యక్రమం గురించి పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బాధితులకు భరోసా ఇచ్చేందుకు పవన్ కల్యాణ్‌ జనవాణి పేరిట కార్యక్రమం చేపట్టారని నాదెండ్ల మనోహర్ వివరించారు. ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమం జరుగుతుందట. మొదటి రెండు వారాలు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారట. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లోనూ ఈ జనవాణి కార్యక్రమం జరగుతుందట. అక్టోబర్ నెలలో పవన్ కళ్యాణ్ చేపట్టే రాష్ట్ర పర్యటనకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది.


ఇటీవల బాపట్ల జిల్లా నుంచి ఓ ఉపాధ్యాయురాలు తన ఇంటికి వెళ్లే దారి లేకుండా వైసీపీ నేతల గోడ కట్టడంపై పోరాడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్ర కూడా చేసినా ఫలితం లేకపోయిందని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారని.. అలాంటి బాధితులకు అండగా నిలవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.


అయితే.. ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందన్న విషయంపై క్లారిటీ లేదు. జనం పవన్ వద్దకు సమస్యలను తీసుకెళ్తే.. వాటిని పవన్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం మాత్రం పరిష్కరిస్తుందా..అన్న అనుమానాలు ఉన్నాయి. అలా జరిగితే ఆ క్రెడిట్ పవన్ ఖాతాలోకి వెళ్తుందన్న సంగతి వారికి తెలుసుకదా. మరి దీనివల్ల సమస్యలు ఎంత వరకూ పరిష్కారం అవుతాయన్నది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: