17వ లోక సభ పదవీకాలం ముగింపునకు వస్తోంది. ఈ లోపే కొత్త లోక్ సభను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. అయితే 17వ లోక్ సభలో ఆసక్తికర అంశాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్(ఏడీఆర్) సంస్థ, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ) ఒక నివేదికలో పేర్కొన్నాయి.  


ఈ నివేదిక ప్రకారం లోక్ సభకు హాజరు కావడంలో టీడీపీ ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. 17వ లోక్ సభ 273 రోజులు నడవగా టీడీపీ ఎంపీలు సగటున 229 రోజులు సభకు హాజరై అన్ని పార్టీల కంటే ముందు వరుసలో ఉన్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీలు 12(సగటున 185రోజుల హాజరుతో), బీఆర్ఎస్ ఎంపీలు 13( సగటున 181 రోజులు)వ స్థానాల్లో ఉన్నారు.


అత్యధిక రోజులు సభకు హాజరైన వారిలో టీడీపీ తర్వాతి స్థానం సీపీఎం సభ్యులదే. వారి సగుటు 226 రోజులు. మరోవైపు ప్రశ్నలు వేయడంలోను టీడీపీ ఎంపీలు ముందు వరుసలోనే ఉన్నారు. టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. ఎన్సీపీ, శివసేన, ఎంఐఎం తర్వాత అత్యధిక ప్రశ్నలు అడిగిదని టీడీపీకి చెందిన ఎంపీలే కావడం గమనార్హం. ఆ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహించిన ముగ్గురు సభ్యులు సగటున 247 ప్రశ్నలు సంధించారు. ఈ విషయంలో వైసీపీ 6, బీఆర్ఎస్ 8 స్థానాల్లో నిలిచాయి.


నరసాపురం నుంచి ప్రాతిథ్యం వహించిన రఘురామకృష్ణ రాజు లోక్ సభ జరిగిన 273 రోజుల్లో 267 రోజులు సభకు హాజరై 97.8శాతం హాజరుతో 17వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం 341 ప్రశ్నలు అడిగారు. టీడీపీ పార్లమెంటరీ నేత గల్లా జయదేవ్ సగటున 236 రోజులు హాజరై(86.4) 291 ప్రశ్నలు వేసి 181వ స్థానంలో ఉన్నారు. వైసీపీ లోక్ సభ పక్ష నేత పీవీ మిథున్ రెడ్డి 185 రోజులు హాజరై 302 ప్రశ్నలు సంధించి 377 వ స్థానానికి పరిమితం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: