ఆంధ్రాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు టికెట్ అత్యంత చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తోంది. వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామ.. అప్పటి నుంచి జగన్ కు పక్కలో బల్లెంలా మారారు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైన క్రమంలో రఘురామ దారెటు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


తొలుత ఆయన బీజేపీ నుంచి నరసాపురం టికెట్ ఆశించగా.. పార్టీ అధిష్ఠానం మొండిచేయి చూపింది. దీంతో ఆయన తాజాగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఇప్పుడు రఘురామ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతలోనే ఆయనకు చంద్రబాబు ఉండి సీటు కేటాయించారని విశ్వసనీయ వర్గ సమాచారం. ఇప్పటికే అనేక సీట్ల విషయంలో గందరగోళం నెలకొన్న సమయంలో రఘురామ ఎంట్రీ తో తాజా సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం కావడం లేదు.


సిట్టింగ్ స్థానాలు మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి పవన్ అడిగిన గుంటూరు-2, రాజమండ్రి రూరల్ సీట్లు ఇవ్వని ఆయన ఇప్పుడు ఉండి సీటు ఎలా ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఆయన నాలుగేళ్లుగా సొంత పార్టీలోనే ఉంటూ జగన్ పై పోరాటం చేసినందుకు ప్రతిఫలంగా ఇచ్చారు అనుకున్నా.. ఇప్పుడు బీజేపీ మరికొన్ని స్థానాలు అడుగుతుంది.


అందులో ముఖ్యంగా హిందూపురం. ఇక్కడ నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది టీడీపీ కంచుకోట. ఇప్పుడు అక్కడ స్వామి పరిపూర్ణానంద పోటీ చేస్తానని అంటున్నారు. దీంతో పాటు మరికొన్ని సీట్లు మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జనసేన  టీడీపీ సిట్టింగ్ సీట్లు అయినా రాజమండ్రి రూరల్, గుంటూరు-2లను గట్టిగా అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకటి మారిస్తే దానికి అనుగుణంగా మరిన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇది కూటమికి కచ్ఛితంగా పెద్ద మైనస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr