ఎన్నికల సమయంలో అమరావతి రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది గతంలో ఏపీ రాజకీయాల్లో సృష్టించిన రాజకీయ ప్రకంపనలు అంతా ఇంతా కాదు.  ఇప్పుడు ఎన్నికలు పీక్ స్టేజీకి వెళ్లిన సమయంలో మరోసారి రాజధాని విషయం తెరపైకి వచ్చింది.  గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనికోసం అమరావతి రైతులు  భూములు కూడా ఇచ్చారు.


ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఏపీలో అధికారాన్ని చేపట్టింది. ఈ సమయంలో రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎజెండాతో మూడు రాజధానులకు పచ్చజెండా ఊపింది. దీంతో అమరావతి ప్రాంతంలో రైతులు, ప్రజలు నిరాహార దీక్షలు, పాదయాత్రలు, కోర్టుల్లో కేసులు ఇలా రకరకాల రచ్చ జరిగింది.


ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్నతరుణంలో మరోసారి ఈ అంశాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది. తాము అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జగన్ మాత్రం తన మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు.  ఇక తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ మూడు రాజధానులు కాదు.. కనీసం ఒక్కదానిని కూడా ప్రారంభించలేకపోయారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


ఇదిలా ఉండగా.. మోదీ అండదండలు లేకుండా రాజధాని మార్పు అనే నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకోగలుగుతారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ కూడా ఈ విషయంలో రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోంది. పార్టీగా మేం అమరావతికి అనుకూలం. కేంద్రం ప్రభుత్వంగా మా చేతిలో ఏమీ లేదు అని ప్రకటించారు. దేశ ప్రధానిగా మోదీ కేవలం విమర్శ చేసి ఊరుకుంటే సరిపోదని.. దీనికి పరిష్కారం కూడా చూపాలని పలువురు పేర్కొంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని మోదీనే రాజధాని అంశంపై ప్రశ్నించి.. పరిష్కారం చూపకపోతే ఇంకెవరు దీనికి బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల అమరావతిపై మోదీ గ్యారంటీ ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: