ఉరుకులు, పరుగుల యాంత్రిక జీవనం, అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కే ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఉదంతం ఇది. హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసిన ఓ పేద ఇంటర్మీడియట్ విద్యార్థినికి అదే హైకోర్టు సిబ్బంది ఆదుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఒక కేసును వాదించాలంటే వేల రూపాయల్లో ఫీజులను తీసుకునే న్యాయవాదులు..ఆ విద్యార్థిని కేసులో ఉచితంగా వాదించడానికి ముందుకొచ్చారు. జిరాక్స్ సెంటర్ యజమాని దగ్గరి నుంచి న్యాయవాది వరకూ ఏ ఒక్కరు గానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. ఆ విద్యార్థిని న్యాయాన్ని అందించడానికి సహకరించారు.

 

జీవనోపాధి కోసం పనిమనిషిగా..
జీవనాధారం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ పేద మహిళ కుమార్తె ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ విద్యార్థిని తల్లి ఇది వరకు దినసరి వేతన కూలీగా పనిచేస్తుండే వారు. అనంతరం పని మనిషిగా మారారు. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఆ విద్యార్థిని 450 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి వచ్చింది. పేదరికం, ఆర్థిక దుస్థితి వల్ల ఆ విద్యార్థిని తల్లి సకాలంలో ఈ ఫీజును చెల్లించలేక పోయారు.

 

25 వేల రూపాయల ఆలస్యపు జరిమానా..
ఫలితంగా- ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏకంగా 25,000 రూపాయల జరిమానాను విధించారు. పరీక్ష హాల్ టికెట్ కావాలంటే 25 వేల రూపాయలను చెల్లించాల్సిందేనంటూ ఆదేశించారు. ఫలితంగా- పరీక్ష రాయలేని దుస్థితిని ఎదుర్కొందా విద్యార్థిని. 450 రూపాయలే కట్టలేని స్థితిలో ఉన్న తాను ఇక 25 వేల రూపాయల మొత్తాన్ని ఎలా చెల్లించగలనని వారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను పలుమార్లు ప్రాథేయపడ్డారు. కనికరించాలని వేడుకున్నారు. అయినప్పటికీ.. అధికారుల్లో చలనం రాలేదు.

 

ఇంటర్మీడియట్ బోర్డు తీరుపై హైకోర్టులో..
ఆమె పని చేస్తోన్న ఇంటి యజమానుల వద్ద అప్పుగా తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆమెకు ఓ మంచి సలహా మత్రం ఇవ్వగలిగారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల తీరుపై హైకోర్టులో కేసు వేయాలని సూచించారు. దీనితో ఆమె తన కుమార్తె భవిష్యత్తు కోసం హైకోర్టు గడప తొక్కడానికి సిద్ధపడ్డారు, రిట్ పిటీషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.

 

మానవత్వాన్ని చూపిన హైకోర్టు సిబ్బంది..
పిటీషన్ వేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కేసు వాదించడానికి అసవరమైన లాయర్ గానీ, కేసును స్వీకరించడానికి చెల్లించాల్సిన ఫీజును గానీ కట్టలేని నిస్సహాయస్థితిని ఎదుర్కొన్నారు. అక్కడే ఈ ఉదంతం సినీ ఫక్కీలో మలుపు తిరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఓ లాయర్.. ఆ విద్యార్థిని కేసును ఉచితంగా వాదించడానికి ముందుకొచ్చారు. పిటీషన్ కాపీని టైప్ చేయడానికి ఓ టైపిస్ట్ సహకరించారు. 15 పేజీల పిటీషన్‌ను ఉచితంగా టైప్ చేసి ఇచ్చారు.

 

ఉచితంగా నంబరింగ్..
అక్కడితో ఆగిపోలేదు ఈ ఉదంతం. జిరాక్స్ సెంటర్ యజమాని ఒకరు ఆ పిటీషన్‌ను నాలుగు సెట్లుగా ఉచితంగా జిరాక్స్ చేసి ఇచ్చారు. దీనికోసం ఆ యజమాని ఆ విద్యార్థిని వద్ద నుంచి ఒక్క రూపాయిని కూడా తీసుకోలేదు. హైకోర్టులో పిటీషన్‌కు నంబరింగ్ ఇవ్వాలంటే కొంత మొత్తాన్ని ప్రాసెస్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును తీసుకోకుండా ఆ పిటీషన్‌కు ఉచితంగా నంబరింగ్ ఇచ్చారు హైకోర్టు క్లర్కు. దీనికోసం చెల్లించాల్సిన మొత్తాన్ని తానే కట్టేస్తానని హామీ ఇచ్చారు.

 

అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు..

చివరికి హైకోర్టు న్యాయమూర్తి సమక్షానికి వెళ్లిందా పిటీషన్. ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. కేసు వివరాలను తెలుసుకున్న తరువాత న్యాయమూర్తి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 450 రూపాయల ఫీజును చెల్లించాల్సి ఉన్న చోట.. ఏకంగా ఆలస్యపు ఫీజు కింద 25,000 రూపాయల జరిమానా విధించడాన్ని తప్పు పట్టారు. ఎక్కడ 450 రూపాయలు.. ఎక్కడ 25,000 రూపాయలు అంటూ ఆగ్రహించారు. ఇంత భారీ మొత్తంలో ఆలస్యపు జరిమానాను విధించడానికి గల సహేతుక కారణాలను వివరించాలని ఆదేశిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు నోటీసులను జారీ చేశారు. ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: