
ఇటీవల హైదరాబాద్ ప్రైవేటు పాఠశాలలోని ఫీజుల సమస్యలపైన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల పక్షాన సానుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలల పైన నియంత్రణ విధించాలి . వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఆరోగ్యశ్రీ కింద అమలు చేసి కరోనా అదుపుకు ప్రభుత్వం సహకరిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైద్యాన్ని ఎంత ప్రయత్నించినా ఆరోగ్యశ్రీ కింద చేర్చకుండా వైద్య రంగాన్ని నిర్వీర్య పరిచి వేలాది మంది చావులకు ప్రభుత్వం కారణమైందని మనమంతా గుర్తించాలి. తమిళనాడు ప్రభుత్వం ప్రైవేటు వైద్యశాలల ను తమ ఆధీనంలోకి తీసుకొని ఉచిత వైద్యాన్ని అందిస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ప్రభుత్వ వైద్యశాలలో కూడా సరి అయినటువంటి చికిత్స అందించకపోవడం ఎంత బాధ్యతారాహిత్యమో ఇప్పటికైనా కొన్ని రాష్ట్రాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలి.
విద్యా వైద్య రంగాలను తమ తమ రాష్ట్రాలలో ప్రక్షాళన చేసుకుని ఆదర్శవంతంగా నిలిచిన ఢిల్లీ, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల సరసన నిలబడటానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంకోచం ఎందుకు? ఇప్పటికైనా ఎన్నికల మీద ఉన్న భ్రమలు అవినీతి ఆరోపణలకు గురికాకుండా నీతివంతమైన పాలన అందించే క్రమంలో అక్రమార్జనకు ఆస్కారం లేని విధంగా పాలన రంగాన్ని తీర్చిదిద్ది మెరుగైన సంస్కరణలు చేపట్టాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు.