టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏంటంటే దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి సినిమా గురించి జరుగుతున్న ప్రచారం. అధికారిక ప్రకటన రాకముందే సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతుండటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం, అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రాన్ని వెంకటేష్ దగ్గుబాటి తో చేయనున్నారని టాక్. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉండబోతుందని, యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ కూడా సమంగా మిళితమై ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వెంకటేష్‌తో పాటు మరో ప్రముఖ హీరో కూడా ఈ ప్రాజెక్ట్‌లో కనిపించనున్నారని, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన భారీ పారితోషికం కోరడంతో చర్చలు ఆగిపోయాయని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

దీనికి తోడు మరో ఆసక్తికరమైన గాసిప్ ఏమిటంటే, ఫహాద్ స్థానంలో తమిళ స్టార్ కార్తీ ను సంప్రదిస్తున్నారని, ఆయన ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇలా రోజు రోజుకీ కొత్త కథనాలు బయటకు వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి స్వయంగా స్పందించడం విశేషం. తన తదుపరి చిత్రంపై వస్తున్న వార్తల గురించి ఆయన మాట్లాడుతూ, “నా తర్వాతి సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. నేను అధికారికంగా ప్రకటించే వరకు దయచేసి ఎలాంటి వార్తలనూ నమ్మవద్దు. ఏదైనా స్పష్టమైన సమాచారం ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. ప్రేక్షకుల్లో ఉన్న కుతూహలాన్ని దయచేసి చెడగొట్టవద్దు” అని విజ్ఞప్తి చేశారు.

అయితే ఆయన “క్యూరియాసిటీని చంపొద్దు” అని చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే కథ లీక్ కావడంతోనే ఆయన అసహనం వ్యక్తం చేశారా? లేక పూర్తిగా అవాస్తవాలే ప్రచారంలోకి వచ్చాయా? అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఇక విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను ఉగాది పర్వదినమైన మార్చి 19న వెల్లడించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఆ రోజునే సినిమా టైటిల్, కథా నేపథ్యం, నటీనటుల వివరాలు వెల్లడయ్యే అవకాశముందని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, అధికారిక ప్రకటన వచ్చే వరకు అన్ని వార్తలు ఊహాగానాలుగానే భావించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ గాసిప్స్ కారణంగా సినిమా మీద హైప్ మాత్రం గణనీయంగా పెరిగింది అనేది నిజం. ఇప్పుడు అందరి చూపు అనిల్ రావిపూడి అధికారిక ప్రకటనపైనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: