పిల్ల‌ల‌ను పెంచ‌డం చాలా తేలిక అనుకుంగారు కొంత మంది. చిన్న పిల్ల‌ల‌ప్పుడు క‌ష్టంకాని కాస్త పెద్ద‌యితే ఇబ్బందులు ఉండ‌వు అందులోనూ మ‌గ‌పిల్ల‌ల‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు పెద్ద‌గా ఉండ‌వు అని భావిస్తుంటారు చాలా మంది. బిడ్డ పుట్టిన వెంటనే వృషణాలు రెండూ కిందకి దిగాయా, లేదా గమనించాలి. ఒకవేళ ఒక వృషణం లేదా రెండూ పొత్తి కడుపులోనే ఉండిపోతే, అవసరాన్నిబట్టి వైద్యులు తగిన చికిత్సతో ఆ సమస్యను సరి చేస్తారు. కొందరు పిల్లల్లో మూత్రనాళం పురుషాంగం చివరన కాకుండా అడుగున ఏర్పడుతూ ఉంటుంది. మూత్ర విసర్జన పురుషాంగం చివరి నుంచి కాకుండా, అడుగు నుంచి అవుతుంటే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. మూత్రం ధారగా కాకుండా సూదితో చిమ్మినట్టుగా సన్నగా పడుతూ ఉంటే పురుషాంగ పూర్వచర్మం మూసుకుపోయి ఉందని అర్థం. ఈ సమస్యను స్వల్ప సర్జరీతో సరిచేయవచ్చు.


 
4, 5 ఏళ్ల వయసులో...
మర్మావయవాలు వయసుతోపాటు సమానంగా ఎదుగుతున్నాయా, లేదా గమనించాలి. ఒకవేళ వృషణాలు, పురుషాంగం మరీ చిన్నవిగా ఉంటే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

 

6,7 ఏళ్ల వయసులో....
వృషణాలు, పురుషాంగం అదే వయసు మగపిల్లలతో పోల్చితే సమానంగా ఉన్నాయా, లేదా గమనించాలి.

 

13, 14 ఏళ్ల యవసులో...
రొమ్ముల సైజు పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తే వైద్యులను సంప్రతించాలి.
అంగం, వృషణాల్లో ఏ ఒక్కటి చిన్నగా ఉన్నా అశ్రద్ధ చేయకూడదు.


టీనేజీ వయసులో...
16 నుంచి 18 ఏళ్ల వయసులో సెక్సువల్‌ క్యారెక్టర్స్‌ స్పష్టంగా కనిపిస్తాయి. మగపిల్లవాడికి మీసాలు పెరగడం, మర్మాంగాల దగ్గర వెంట్రుకలు పెరగడం లాంటి లక్షణాలు ఉన్నాయో లేదో తండ్రులు గమనించాలి. ఈ లక్షణాలు కనిపించడం ఆలస్యమైతే వెంటనే వైద్యుల చేత హార్మోన్‌ పరీక్షలు చేయించాలి.

 

సెక్సువల్‌ ఓరియెంటేషన్‌...
కొందరు తల్లితండ్రులు మగపిల్లలకు ఆడపిల్లల దుస్తులు వేసి మురిసిపోతూ ఉంటారు. జడ వేసి, పువ్వులు అలంకరించి, ఆడపిల్లల దుస్తులు వేయడమే కాకుండా ఆడపిల్లల పేర్లతో పిలుస్తూ ఆడిస్తూ ఉంటారు. పిల్లలకు ఊహ తెలియని వయసులో ఇలాంటి ముచ్చటలు తీర్చుకుంటే ఫర్వాలేదు. కానీ ఊహ తెలిసిన తర్వాత ఇలాంటివి చేయడం వల్ల మగపిల్లల్లో ఆడ లక్షణాలు నాటుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇరుగు పొరుగు ఆడ పేరుతో పిలవడం మొదలుపెడితే మగపిల్లల్లో ఆత్మన్యూనత దెబ్బతిని అందర్లో కలవకుండా అంతర్ముఖులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మగపిల్లలను ఆడపిల్లలుగా అలంకరించే అలవాటు పెద్దలు మానుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: