ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై ఆందోళనకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. క్షయ వ్యాధి (Tuberculosis) ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నట్లు వెల్లడైంది. 2024లో మొత్తం 83 లక్షల మంది కొత్తగా టీబీ బారిన పడ్డారని WHO పేర్కొంది. ఇది గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. కరోనా మహమ్మారి మన ఆరోగ్య వ్యవస్థపై వేసిన దెబ్బ ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదనే సంకేతమే ఇది. మహమ్మారి సమయంలో టీబీ పరీక్షలు, చికిత్సలు నిలిచిపోవడం, వైద్య సదుపాయాలు అత్యవసర సేవలకు మళ్లించడంతో లక్షలాది కేసులు గుర్తించబడలేదు. అయితే, మహమ్మారి అనంతరం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో నిర్ధారణలు పెరిగినట్లు WHO స్పష్టం చేసింది.
 

మరణాలు తగ్గినా... ముప్పు మాత్రం ఆగలేదు .. నివేదిక ప్రకారం, 2023లో టీబీ వల్ల 12.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, 2024లో ఈ సంఖ్య 12.3 లక్షలకు తగ్గింది. ఇది వైద్య వ్యవస్థ సరైన దిశలో కదులుతోందన్న సంకేతం ఇస్తున్నా, కొత్త కేసుల పెరుగుదల మాత్రం తీవ్ర ఆందోళనకరం. ముఖ్యంగా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా టీబీ కేసులు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్లోబలైజేషన్, వలసల కారణంగా వ్యాధులు సరిహద్దులు దాటి ప్రయాణిస్తున్నాయన్న వాస్తవాన్ని ఇది గుర్తుచేస్తోంది. స్తబ్ధుగా ఉండే వైరస్.. మోసపూరిత స్వభావం .. ప్రపంచ జనాభాలో దాదాపు 25 శాతం మందిలో టీబీ బ్యాక్టీరియా ఉన్నా, వారిలో కొద్ది మందిలోనే వ్యాధి బయటకు కనిపిస్తుంది. ఇదే టీబీ యొక్క మోసపూరిత స్వభావం. ఈ బ్యాక్టీరియా శరీరంలో స్తబ్ధుగా సంవత్సరాల తరబడి ఉండగలదు, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది.

 

అందుకే టీబీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంటువ్యాధుల్లో ఒకటిగా కొనసాగుతోంది.  భారత్‌కు అతిపెద్ద సవాలు .. WHO నివేదిక ప్రకారం, భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వంటి దేశాలు ప్రపంచ టీబీ భారంలో అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్‌ ఒక్కదానిలోనే ప్రపంచ టీబీ కేసుల్లో దాదాపు 28 శాతం నమోదవుతున్నాయి. ప్రభుత్వం 'నిక్షయ్ పోర్టల్' ద్వారా ట్రాకింగ్, ఉచిత చికిత్స అందిస్తున్నప్పటికీ, పేదరికం, పోషకాహార లోపం వంటి సామాజిక సమస్యలు టీబీ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పౌష్టికాహారాన్ని అందించడం వంటి సమగ్ర చర్యలు అవసరం. WHO నివేదిక చివరిగా ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది: ‘క్షయవ్యాధి అంతం చేయాలంటే కేవలం మందులతోనే కాదు.. మానవ వ్యవస్థలో ఉన్న అసమానతలను కూడా నయం చేయాలి.’ లేకపోతే, క్షయవ్యాధి మన శతాబ్దపు నిశ్శబ్ద మహమ్మారిగా నిలిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

WHO