సంక్రాతి పండుగ వచ్చిందంటే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  కొడిపందేల సందడే కనిపిస్తుంది. పండుగకు పది రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. అయితే వేల సంఖ్యలో కోడిపుంజులు ఇక్కడ పందేల్లో ఢీకొంటాయి. ఇన్ని పందెం పుంజులను గోదావరి జిల్లాల్లోనే పెంచడం అసాధ్యం. కాబట్టి గోదావరి జిల్లాల ప్రజలు.. నెల్లూరు ,చిత్తూరు జిల్లాల నుంచి కోడిపుంజులను తెచ్చి పందెలు ఆడతారు. 

 

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి పండుగ పెద్దగా జరుపుకోరు. దీనికి కారణం వీరికి నైరుతీ రుతుపనాలతో కాకుండా ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. అంటే.. అక్టోబర్ నుంచి వర్షాలు మొదలై సంక్రాంతి వరకు వర్షాలు వస్తాయి.  నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాల్లో రబీలోనే పంటలు సాగు చేయడం మొదలు పెడతారు. అందువల్ల సంక్రాంతికి పంటలు చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో... పండుగను పెద్దగా జరుపుకోరు. అయితే ఇక్కడ గ్రామాల్లో మాత్రం దొంగచాటుగా కొడిపందేలు మాత్రం అడుతారు. అందుకోసం గతంలో ప్రత్యేకంగా కోడి పుంజులను పెంచేవారు. ఇప్పుడు అదే ఆదాయ వనరుగా మారింది. 

 

నెల్లూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్య కార గ్రామాలతో పాటు సూళ్ళురు పేట, తడ, నాయుడు పేట... చిత్తూరు జిల్లాలోని కాళహస్తి, సత్యవేడు ప్రాంతాల్లో పందెం పుంజుల పెంపకం జోరుగా సాగుతుంది. తమిళనాడులోని సేలం నుంచి ప్రత్యేకంగా కోడిగుడ్లను తీసుకు వచ్చి పొదిగిస్తారు. స్థానికంగా మంచి రకాల కోడి పుంజులను బ్రీడ్ చేసి వాటి పిల్లలను ప్రత్యేకంగా పెంచుతారు. 

 

ఒక్కొక్కరు పది నుంచి పాతిక కోడి పుంజులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. కోడిపుంజులకు నాణ్యమైన ఆహారం అందిస్తారు. అందులో కర్నూలు జిల్లా నుంచి తెప్పించిన జొన్నలు, జీడిపప్పు, బాదం, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. కొన్నింటికి బోన్‌లెస్ చికెన్ కూడా ఆహారంగా ఇస్తారు. పౌష్టికాహారంతో పాటుగా రోజూ ఎక్సర్‌సైజులు చేయిస్తారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయి. కోడి పందెంలో దిగి ప్రత్యర్థి కోడితో పోరు సాగించాలంటే తమ కోడికి అన్ని రకాల తర్ఫీదులు అందిస్తామంటున్నారు. దీంతో పాటు బరిలో దించి ఇక్కడే వాటికి శిక్షణ ఇస్తారు. ఆహారం కోసం ఒక్కో పుంజు మీదా ఐదు నుంచి పది వేల వరకు ఖర్చు పెడుతున్నవారు వున్నారు. 

 

ఈ ప్రాంతాల్లో అన్ని రకాల కోడి పుంజులను పెంచుతున్నారు.  కాకి, పచ్చ కాకి, కాకి నెమలి, డేగ లాంటి పుంజులను పెంచుతున్నారు. ఇక్కడ నుంచే పుంజులను గోదావరి జిల్లాలకు తీసుకుపోయి అమ్ముతారు. గోదావరి జిల్లాలకు చెందిన చాలామంది ఇక్కడ కోడి పుంజులను కొనుగొలు చేస్తుంటారు. ఒక్కో కోడి పుంజును పాతిక వేల నుంచి 75 వేలు పెట్టి కొంటారు. ఇంతకాలం పందెం కోడిపుంజులు అమ్మకాలు గుట్టుగా సాగాయి. అయితే ఈ మధ్య గోదావరి జిల్లాలో పోలీసులు కోడి పుంజులు అమ్ముతున్న వారిని పట్టుకున్నారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

 

తాము వ్యాపకంగా కోడి పుంజులను పెంచుతున్నామని, అది ఆదాయవనరుగా మారిందని పెంపకదారులు అంటున్నారు. చాలమంది బడా రైతులు ,రాజకీయ నేతలు పందాలకు ఎద్దులను పెంచుతారని, అదే విధంగా తాము కూడా కోడి పుంజులను పెంచుతున్నామని.. ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అయితే వ్యవహారం కాస్తా పోలీసుల వరకు వెళ్ళడంతో పెంపకందారులు బాహాటంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: