ఎంతో ఎత్తున ఉన్నాన‌ని భావిస్తుంది.. కానీ ఒకే ఒక్క‌గాలివాన‌కు తాను ఎక్క‌డికి వ‌చ్చి ప‌డేదీ దానికి తెలియ దు గ‌ద్ద‌! ఇప్పుడు మ‌నోళ్ల ప‌రిస్థితీ ఇలానే ఉంది. డాల‌ర్ల మెరుపుల మ‌ధ్య క‌న్నీళ్లు చార‌లు క‌డుతున్నాయ్‌! పుట్టిన గ‌డ్డ‌లో ఏముంది మట్టి!- అని దేబిరించి డాల‌ర్ల వేట‌లో దూర‌పు కొండ‌లను స్ట్ర‌యిట్‌గా ఎక్కేయొచ్చ‌ని భావించి.. రెక్క‌ల గుర్రాలెక్కి.. ర‌య్యిన వాలిపోయారు. అది అమెరికానా.. ఆఫ్రికానా.. ఇసుక దిబ్బ‌లా.. ఏదైనా కావొచ్చు.. ఆశ‌ల ప‌తంగులు ఎగిరాయి... డాల‌ర్ల వృష్టి రాలుతుంద‌ని చేతులు ప‌ట్టారు..

 

కానీ, అనూహ్యం.. అవ‌మానం.. విషాదం.. క‌నిపించ‌ని శ‌త్రువు క‌ల్లోలం సృష్టించేస‌రికి.. డాల‌ర్ల వేట క‌న్నీటి బాట అయింది. ప్ర‌స్తుతం క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో ప్ర‌పంచం మొత్తం పిడుగు ప‌డిన‌ట్టు మారిపోయింది. దారి పోతున్న జ‌నాలు.. జీబ్రాలైన్‌ను జాలీగా దాటేసిన‌ట్టు శ‌వాల‌ను దాటుకుని పోతున్నారు. వీరిలో మ‌న‌వా ళ్లు ఉన్నార‌నే విష‌యం కూడా మ‌న‌కు నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలియ‌దు! అమెరికాలో సామూహికంగా 40 మందిని భూమిలోకి పెట్టేశార‌నే వార్త‌.. మ‌నకు క‌న్నీళ్లు కూడా పెట్టించ‌క‌పోవ‌చ్చు!

 

కానీ, బ‌తుకు వేట‌లో వెళ్లిన వారిలో మ‌నోళ్లు ఒక‌రిద్ద‌ర‌యినా.. వారిలో ఉన్నార‌ని తాజాగా తెలిసి అవే క‌ళ్లు నేడు విస్మ‌యం అవుతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో మ‌నోళ్ల‌కు నిలువ నీడ లేక .. విమానాశ్ర‌యాలే ల‌గ్జ‌రీ విశ్రాంతి గ‌దుల‌య్యాయి. కారిడార్ లే క‌న‌క మేడ‌ల‌య్యాయి. చిన్న జీవి.. ప్ర‌పంచాన్ని ఒణికించింద‌ని చెప్పుకొంటున్నాం... ఇప్పుడు గుప్పెడు ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డానికి కూడా మ‌న‌సులు రావ‌డం లేదు!  మ‌న గురించి మ‌నం ఆలోచించుకునేందుకు స‌మ‌యం చాల‌ని ప‌రిస్థితి నుంచి వేరే వారిని ఆలోచించే తీరిక‌లేదు!  సో.. ఆశ‌ల ప‌తంగులు రాలుతున్నాయ్‌.. క‌న్నీళ్లు కొడిగ‌డుతున్నాయ్‌.. అన్నీ.. క‌రోనా వేగంతోనే!!

మరింత సమాచారం తెలుసుకోండి: