ఏపీలో అధికార వైసీపీ ఎంత బలంగా ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిన ఏకగ్రీవాలు బట్టి అర్ధమైపోతుంది. అయితే 175 స్థానాల్లో వైసీపీ బలంగా ఉందా? అంటే లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రతిపక్ష టీడీపీకు కొన్నిచోట్ల తిరుగులేని బలం ఉంది. అలా టీడీపీ బలం ఉన్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అందులో విశాఖపట్నం నగరంలోని నియోజకవర్గాల్లో టీడీపీ బాగా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా పశ్చిమ స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఆధిక్యం ఎక్కువగా ఉంది. ఆయన ముందు వైసీపీ నేత మళ్ల విజయ్ ప్రసాద్ తేలిపోతున్నారు.

 

గణబాబు రాజకీయ జీవితం చూసుకుంటే... గణబాబు తండ్రి అప్పలనరసింహం 1984 లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తరువాత 1989 లో ఓడిపోయారు. ఇక తండ్రి వారసత్వంతో గణబాబు  టీడీపీలోకి వచ్చి 1999 లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 లో ఓటమి పాలయ్యారు. అయితే తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో గంటా శ్రీనివాసరావుతో కలిసి, ఆ పార్టీలోకి వెళ్లి 2009 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మళ్ల విజయ్ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు.

 

అయితే నెక్స్ట్ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడం, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పని ఖతం కావడంతో మళ్ళీ గంటాతో కలిసి టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో అదే పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అప్పుడు టీడీపీ కూడా అధికారంలో ఉండటంతో గణబాబు బాగా పనిచేసారు. ఇక అదే ఊపులో 2019  ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా ఉన్నాసరే గణబాబు మాత్రం 18 వేల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మళ్ల విజయ్ ని ఓడించారు.

 

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాసరే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. పెద్దగా వివాదాలు జోలికి పోని గణబాబు, తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జ్ గా మళ్లనే కొనసాగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే మళ్ల ఇక్కడ బలపడలేదు. దీంతో వైసీపీ గణబాబుని లాగేసుకుందామని అనేకసార్లు ప్రయత్నాలు చేసింది. కానీ గణబాబు టీడీపీలోనే ఉన్నారు.

 

ఒకానొక సమయంలో ఆయన బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగినా, పార్టీ మారకుండా అలాగే ఉన్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే పశ్చిమ స్థానం విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది. కానీ అధికారం, రాజధాని ప్రభావం వైసీపీకి అనుకూలంగా మారొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ గణబాబు మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఆయన ముందు వైసీపీ అయితే నిలబడలేకపోతుందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: