కర్నూలు జిల్లాలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో నందికొట్కూరు కూడా ఒకటి. గత రెండు పర్యాయాలుగా ఇక్కడ వైసీపీదే విజయం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హవా ఎక్కువగా ఉంటుంది. ఆ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న బైరెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున ఆర్థర్ బరిలో నిలబడ్డారు. జగన్ వేవ్‌లో, బైరెడ్డి సపోర్ట్‌తో ఆర్థర్ భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక అక్కడ నుంచే అసలు రచ్చ మొదలైంది. ఆర్థర్, బైరెడ్డి వర్గాల ఆధిపత్య పోరు పెరిగింది. ఈ రెండు వర్గాల మధ్య ఏదొక అంశంలో రచ్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఒకసారి ఆర్థర్ కూడా, రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నెక్స్ట్ ఎన్నికల్లో పోటీలో ఉండనని చెప్పారు. అయితే ఎమ్మెల్యేగా ఆర్థర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కోసం పనిచేస్తున్నారు. అటు బైరెడ్డి కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ, వారికి అండగా నిలబడుతున్నారు.

నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు పథకాలు అమలులో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే నియోజకవర్గంలో కొన్ని సమస్యలు కూడా ఉండగా, అందులో ముఖ్యంగా తాగునీటి సమస్య అధికంగా ఉంది. నందికొట్కూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండగా, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అటు నియోజకవర్గంలో రోడ్లని అభివృద్ధి చేయాలసిన అవసరముంది.

రాజకీయంగా ఇక్కడ బైరెడ్డికి తిరుగులేదు. నియోజకవర్గంలో బైరెడ్డి హవా ఎక్కువగానే ఉంది. ఇదే ఎమ్మెల్యే ఆర్థర్‌కు పెద్దతలనొప్పి అయింది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు వైసీపీ అధిష్టానం వీరి పోరుకు బ్రేకులు వేయడానికి చూసిందిగానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే తాజాగా బైరెడ్డికి నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు. అయినా సరే బైరెడ్డి, ఆర్థర్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆగడం కష్టమే అని తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఆర్థర్ మళ్ళీ పోటీ చేస్తారా? లేదా? అనే అంశం క్లారిటీ రావడం లేదు. ఒకవేళ ఆర్థర్ పోటీ చేస్తే బైరెడ్డి వర్గం మద్ధతు ఉంటుందా? అనేది డౌటే. ఇక ఇక్కడ టీడీపీ కథ కంచికే. వైసీపీలో అంతర్గత పోరు ఉన్నా సరే, ఇక్కడ ఆ పార్టీని దెబ్బకొట్టడం చాలా కష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: