యంగ్ హీరో శర్వానంద్ కెరియర్ కు ఈవారం విడుదలకాబోతున్న ‘శ్రీకారం’ మూవీ అత్యంత కీలకంగా మారింది. శివరాత్రి రోజున అనేక సినిమాలతో పోటీ పడుతూ విడుదల అవుతున్న ఈ మూవీ కథ ఒక ఫీల్ గుడ్ స్టోరీ. సమాజంలో రైతుల ప్రాధాన్యతను తెలియచేస్తూ రైతుల కొడుకులు వారసత్వంగా ఎందుకు వ్యవసాయ వృత్తిలోకి రాలేకపోతున్నారు అన్న విషయం చుట్టూ ఈ మూవీ కథ అల్లబడింది.


వరస పరాజయాలతో సతమతమైపోతున్న శర్వానంద్ ఈమూవీ పై మరింత క్రేజ్ పెంచడానికి చేయబోయే భారీ ప్రమోషన్ కు ఇప్పుడు రామ్ చరణ్ కూడ సహకరిస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. శర్వానంద్ రామ్ చరణ్ లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నప్పటి నుండి వారిద్దరి స్నేహం కొనసాగుతూనే ఉంది.


మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ వారం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నాడు. కేవలం రామ్ చరణ్ బలవంతంతో హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఖమ్మం వెళుతూ ఈ ఈవెంట్ కోసమే తన అలసటను కూడ లెక్కచేయకుండా వస్తున్నాడు. అదేవిధంగా హైదరాబాద్ లో జరగబోయే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిధిగా రాబోతున్నారు.


ఈ రెండు ఈవెంట్స్ వెనుక చరణ్ పరోక్ష సహకారాలు ఉన్నాయి అన్నవార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ చిన్నతనంలో శర్వానంద్ ఎక్కువగా రామ్ చరణ్ ఇంట్లోనే ఉంటూ చరణ్ కు చదువు పై ఆశక్తి కలిగేలా కలిసి చదువుకునే వారట. ఆతరువాత చరణ్ టాప్ యంగ్ హీరో స్థాయికి ఎదిగినప్పటికీ వీరి స్నేహం కొనసాగుతూనే ఉండటంతో పాటు వివాదాలకు దూరంగా ఉండే శర్వానంద్ ‘శ్రీకారం’ హిట్ కావాలని ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు కోరుకుంటూ ఉండటం విశేషం. ఈ ఈవెంట్స్ తరువాత ఈమూవీ పై మరింత క్రేజ్ పెరిగే ఆస్కారం ఉంది..




మరింత సమాచారం తెలుసుకోండి: