"ఆర్ఆర్ఆర్" సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా అది సెన్సేషన్ అవుతోంది. మరోవైపు రాజమౌళి కూడా విభిన్న ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మేకింగ్ వీడియో "రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్" ట్రైలర్ రేంజ్ లో దూసుకెళ్లింది. జస్ట్ మేకింగ్ వీడియోకి ఆ రేంజ్ లో భారీ రెస్పాన్స్ రావడంతో టీమ్ మొత్తం ఖుషి అయింది. మరోవైపు "బిహైండ్ ది సీన్స్" డాక్యుమెంటరీని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన విషయం రివీల్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో రాంచరణ్ పోలీస్ అవతారంలో మెగా అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నాడట. 

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ "ఆర్ఆర్ఆర్"లో చరణ్ పోలీస్ అవతారం వెనుక ఓ కథ ఉంటుందని, అది తెరపై ఆనందం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. రామ్ చరణ్ పోలీస్ అవతారం వెనుక ఉన్న కథ ఏంటనే విషయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గతంలో విడుదలైన "సీతారామరాజు" టీజర్లో చరణ్ పోలీస్ అధికారిగా కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్లో ప్రత్యేక సెట్లో ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. చివరి షెడ్యూల్ లో సినిమాలోని ప్రధాన పాత్రధారులపై భారీ సాంగ్ రూపొందించడానికి చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై 400 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, శ్రియ శరన్ వంటి ప్రపంచ దిగ్గజ నటీనటులు కనిపించనున్నారు. ఇప్పటికే మూవీపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR