ముంబయి 26/11 దాడుల్లో వీరోచితంగా పోరాడిన మరణించిన యువ ఆర్మీ ఆఫీసర్‌ మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ సినిమా మేజర్‌. జూన్ 3న  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా... వర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత కావడం విశేషం. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విశాఖ  వచ్చింది. ఈ బయోపిక్ కోసం బాలీవుడ్‌ వాళ్లు ప్రయత్నించారని కానీ సందీప్ త‌ల్లిదండ్రుల‌కు వాళ్ళు న‌చ్చలేదని..  అడవి శేష్ తెలిపారు.


ఆ తర్వాత మలయాళం మేకర్స్ కూడా సందీప్ తల్లి తండ్రులని అడిగినా ఒప్పుకోలేదని..  వాళ్ళు చూపించిన హీరోలు త‌మ కొడుకులా లేర‌ని సందీప్ త‌ల్లి సున్నితంగా తిర‌స్కరించారని  అడవి శేష్ అన్నారు. తన టెస్ట్ లుక్ చూసి సందీప్ లాగానే ఉన్నాను అని భావించి సినిమాకి ఓకే చెప్పారని.. తనను సందీప్ పాత్రలో చూసి వారు చాలా హ్యాపీగా ఫీల‌య్యారని.. తనలో సందీప్ ను చూసుకున్నారని  అడవి శేష్ తెలిపారు.


తాను సందీప్ తల్లిని ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను అని తెలిపిన  అడవి శేష్.. ఇందులో కేవలం ఆ రోజూ జరిగిన దాడులు మాత్రమే కాదు సందీప్ జీవితంలోని స్కూల్ డేస్‌, క‌శ్మీర్‌ డేస్, అన్నీ ఉంటాయన్నారు. గొప్ప మ‌నుషులు పుట్టరని.. వారు చేసే ప‌ని వ‌ల్ల గొప్ప మ‌నిషి అవుతారని  అడవి శేష్ తెలిపారు . సందీప్ కూడా అలాంటివారిలో ఒకరని.. ఈ సినిమాకు ఇప్పటికే ఓపెన్ చేసిన ప్రీ బుకింగ్స్ మంచి స్పందన వస్తోందని  అడవి శేష్ అన్నారు.  


సినిమా విడుదలకు ముందే స్పెషల్ షో ప్రదర్శించడం ఇదే మొదటిసారి అంటున్న  అడవి శేష్... ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రను ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ షోలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను ఇప్పటికే పుణె, జైపూర్, అహ్మాదాబాద్, ఢిల్లీ, లక్నో, బెంగుళూరు, కొచ్చి, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ప్రదర్శించారు. వీటికి మంచి టాక్ వచ్చిందని యూనిట్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: